Tuesday 30 January 2024

శ్రీ గరుడ పురాణము (75)

 


హయగ్రీవ పూజనావిధి


సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవపూజను ఇలా వినిపించసాగాడు.


"హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది :


ఓం సౌం క్షౌం శిరసే నమః


ముందుగా ఎప్పటి వలెనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. (ఈ మంత్రాలిది వఱకే ఇవ్వబడ్డాయి. అయినా (అనుబంధం- 5లో చూడవచ్చు).


హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళతంతు, రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగ, కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపియైన దేవత ముకుట, కుండల, వనమాలా సుశోభితుడై సుదర్శనయుక్తుడై, సుందరదరహాసవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై వుంటాడు.


ఈ స్వామిని, అన్ని దేవతలనూ తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకొని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి. తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో వున్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రంతో :


ఓం హయ గ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః |


తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతనూ విధాతనూ పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగ, మహాదేవిలను, శంఖ, పద్మ, నామక నిధులనూ, అగ్రభాగంలో గరుడునీ, మధ్యభాగంలో ఆధారశక్తినీ పూజించాలి. (ఈ మంత్రాలన్నీ ఇదివఱకే చెప్పబడ్డాయి)


No comments:

Post a Comment