Monday 9 June 2014

హిందూ ధర్మం - 78 (మేనక ఆగమనం )

విశ్వామిత్రుడి కన్నులు కోపంతో ఎరుపెక్కి శపించడం మొదలుపెట్టాడు. మీరు నా మాటను అతిక్రమించడమే కాకుండా, నాకు పరుషంగా సమాధానమిచ్చారు. మీరు కూడా వశిష్టపుత్రులు పుట్టిన జాతిలోనే జన్మించి వేయి సంవత్సరాల పాటు భూమి అంతటా తిరుగుతూ కుక్కమాంసం తిని జీవిస్తారు అన్నాడు. అటు తర్వాత దయతో శునఃశ్శేపుడి వైపు తిరిగి రక్షణ కొరకు వేదమంత్రాలు చదివి ఆశీర్వదించాడు. 'నిన్ను పాశాలతో బంధించి, నీకు ఎర్రటి రంగును పూసి, మెడలో ఎరపు రంగు పూలహారం వేసి, విష్ణు సమానుడైన అగ్నిహోత్రునకు అర్పించే ముందు, నేను ఇప్పుడు నీకు చెప్పబోయే వేదంలోని సూక్తాలు చదువు. నేను చెప్పిన రెండు సూక్తాలు చదువగానే నీ కోరిక నెరవేరుతుంది' అని చెప్పి, ఆ పిల్లవానికి విశ్వామిత్రుడు వాటిని ఉపదేశించాడు. వాటిని జాగ్రత్తగా గ్రహించిన శునఃశ్శేపుడు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళి రాజా! త్వరగా యాగశాలకు వెళదాం రండి అన్నాడు. నన్ను యజ్ఞపశువుగా అర్పించి, మీరు మీ ప్రతిజ్ఞను, యాగాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఇది విన్న అంబరీషుడు త్వరగా యాగశాలకు చేరుకున్నాడు.

రాజు పురోహితుల అనుమతి తీసుకుని పిల్లవానికి పవిత్రమైన ఎరుపు రంగు బట్టలు కట్టి, యాగపశువుగా తయారు చేసి, అక్కడున్న స్థంభానికి బందించాడు. వెంటనే శునఃశ్శేపుడు ఇంద్రుడిని, ఉపేంద్రుడిని విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన రహస్య సూక్తాల ద్వారా ప్రార్ధించాడు. అతని ప్రార్ధనకు మెచ్చి, సహస్రాక్షుడైన (వేయి కన్నులు కలవడు) ఇంద్రుడు ధీర్ఘాయువును ప్రసాదించాడు. అంబరీషునిపై కూడా తన అనుగ్రహాన్ని వర్షించాడు. అందువల్ల అంబరీషుడు చేసిన యాగానికి అనేక రెట్ల ఫలం కలిగింది.

తన పుత్రలను శపించడం వలన విశ్వామిత్రునకు తపోశక్తి వృధా అయ్యింది. అందువల్ల విశ్వామిత్రుడు ఆ పవిత్ర సరోవరం వద్దనే కూర్చుని ఇంకో వెయ్యేళ్ళు తపస్సు చేశాడు. వేయి సంవత్సరాలు పూరతైన తర్వాత విశ్వామిత్రుడు వ్రతస్నానం చేశాడు. అది ముగియగానే విశ్వామిత్రుని ముందు దేవతలందరూ అతని తపోఫలాన్ని ప్రసాదించడానికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పటి వరకు నీవు చేసిన తపస్సు కారణంగా రాజర్షివి అయినావు. నీకు శుభం కలుగుగాకా అని బ్రహ్మదేవుడు పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు (రాజైన నీవు ఇప్పటి వరకు చేసిన తపస్సు కారణంగా రాజర్షి మాత్రమే కాగలిగావు కానీ బ్రహ్మర్షి కాలేకపోయావు. బ్రహ్మర్షి స్థానం చాలా గొప్పది. బ్రహ్మర్షి అవ్వాలంటే కోపం, కుళ్ళు, పగ, కొరిక మొదలైన దుర్గుణాలన్నీ విడిచిపెట్టాలి). విశ్వామిత్రుడు తిరిగి తపస్సు మొదలుపెట్టాడు.

చాలా కాలం గడిచాకా, ఒకానొక కాలంలో దేవలోకపు అప్సరస అయిన మేనక ఆ సరోవరంలో స్నానం చేసి, జలకాలాడుతోంది. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు సరోవరంలో ఈసుతున్న మేనకను చూశాడు. మేనక అందం సాటిలేనిది. దట్టంగా కమ్మిన మబ్బుల మధ్య కనిపించే మెరుపులా ఉంది మేనక.

To be continued ............

No comments:

Post a Comment