Thursday 12 June 2014

హిందూ ధర్మం - 81 (మళ్ళీ ఘోరతపస్సు చేసిన విశ్వామిత్రుడు)

కోపం వలన ఆయన చేసిన తపస్సు వృధా అవుతోంది, ఇంద్రియాలను జయించని కారణంగా అశాంతి కలుగుతోంది. దీంతో ఆయనలో మార్పు వచ్చింది. నేను ఇక నుంచి ఎవరిని కోపగించుకోను, ఎవరిని నోటితో ఏ మాట చెడుగా అనను. అలాకాపోతే నేను గాలి కూడా పీల్చకుండా వందేళ్ళు తపస్సు చేస్తాను. నేను విజితేంద్రియుడను అయ్యేంతవరకు నన్ను నేను ఆత్మశుద్ధి చేసుకుంటాను. నేను బ్రహ్మర్షి స్థానానికి నా సొంత తపశ్శక్తి వలన అర్హత పొందేవరకు నేను గాలి పీల్చను, ఆహారం తీసుకోను. అంతులేని సమయం పట్టినా సరే. నేను తపస్సులో ఉండగా, నా శరీరభాగాలు క్షయం పొందవు అని తనకు తాను చెప్పుకుని ఒక శపధం చేశాడు. తాను అనుకున్నట్టుగానే ఎవరు చేయలేని విధంగా వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈసారి విశ్వామిత్రుడు తపస్సు కోసం మంచు కప్పుకున్న హిమాలయాలను విడిచి, తూర్పు దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు. తన సంకల్పానికి అనుగుణంగానే మౌనంగా ఉత్తమైన, ఎంతో కష్టమైన తపస్సులో నిమగ్నమయ్యాడు.

వెయ్యేళ్ళు పూర్తైన తర్వాత కూడా, బలమైన శరోరం, ఎన్ని అవరోధాలనైనా తొలగించగల శక్తి వచ్చినప్పటికి, అవ్యయమైన తపస్సు చేసి కృత నిశ్చయంతో ఉన్న కారణంగా ఆయనలోకి కోపం కొంచం కూడా ప్రవేశించలేకపోయింది. వేయి సంవత్సరాల తపస్సు పూర్తైన తర్వాత ఆయనకు ఎంతో ఆకలేసింది. తను వంట చేసుకుని, తినడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన్ను పరీక్షిద్దామని బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు వచ్చి, సిద్ధంగా ఉన్న భోజనం తనకు పెట్టమని ప్రార్ధించాడు. ఎంతో ఆకలితో ఉన్నాడు, ఎన్నో ఏళ్ళ తర్వాత తిండికి సిద్ధమైనప్పుడు, ఎవరైనా వచ్చి, నోటి దగ్గరి ఆహారం లాక్కుంటే ఎంత కోపం వస్తుంది. కానీ విశ్వామిత్రునకు ఈసారి కోపం రాలేదు. తపస్సు చేత చిత్తం శుద్ధి పొందింది. మొత్తం ఆహారాన్ని ఆ బ్రహ్మణుడికి మనస్పూర్తిగా ఇచ్చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు విశ్వామిత్రునకు ఏమి మిగల్చకుండా మొత్తం తినేశాడు. మహర్షి పస్తులున్నాడు కానీ  ఒక్కమాట కూడా అనలేదు, సరికదా మౌనంగా ఉంటూ, తన ఊపిరిని అదుపు చేసుకుంటూ, అక్కడ కూడా తన దీక్షను కొనసాగించాడు. ఇది జరిగాకా మళ్ళీ ఇంకో వేయి సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా ఆయన శిరస్సు నుంచి వచ్చిన పొగలు మూడులోకాలను కప్పేశాయి. మూడులోకాల్లో ఉన్న దేవతలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

ఆయన తపో తేజస్సు ముందు దేవతల తేజస్సు ఎందుకు పనికిరాకుండా ఉంది. దేవతలు, గంధర్వులు, పాములు, ఉర్గలు, రాక్షసులు పితామహుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.

To be continued ...............

No comments:

Post a Comment