Sunday 22 June 2014

హిందూ ధర్మం - 90

పైన ఒక వ్యక్తి/ వ్యవస్థ ఉండి, చేసిన తప్పులకు శిక్షిస్తుంటే బాధపడని వ్యక్తులు లోకంలో ఎవరూ ఉండరు. చేసిన తప్పుకు చింతించకపోయినా, శిక్షకు భయపడతారు. కానీ వ్యక్తికి మొత్తం స్వేచ్చని ఇచ్చి, శిక్ష గురించి అతనికి ఏ భయం లేనప్పుడు అతను ఎలా స్పందిస్తాడన్నదే ముఖ్యం. ధర్మం కూడా అదే అంటున్నది. ఎటువంటి వ్యవస్థ లేకపోయినా, నీకు నువ్వుగా చేసిన తప్పును తెలుసుకుని, నడవడికను మార్చుకోవడం ఉత్తమ లక్షణం. ఈ రోజు కాలం మారిందన్న నెపంతో పెడదారి పట్టి ఎన్నో తప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. పోని చేసిన తప్పును గుర్తించి బాధపడతారా అంటే అదీ లేదు. ఇదంతా ఫ్యాషనండి, అందరూ ఇలాగే చేస్తున్నారు అంటూ సమర్ధన ఒకటి. అలా సమర్ధించుకునే వాడు ఇంకేం బాగుపడతాడు.

హ్రీః అంటే సిగ్గు పడటం, పశ్చాత్తాపం చెందటం అనే అర్దాలున్నాయి. పైన ఒకడు ఉన్నాడు, వాడు అన్నీ చూస్తున్నాడు, నేను తప్పు చేసి భగవంతుని ముందు ఎలా నిల్చోను? ఈ రోజు కాకపోయినా, మరణించినా తర్వాత ఎందుకిలా చేశావ్? అని ఆయన అడిగితే ఏమని సమాధానం చెప్పను \, పోని రేపు ఏదైనా కష్టం వస్తే, తప్పు చేసిన నేను ఆయన ముందు వెళ్ళి, ఎలా మొహం చూపించగలను అన్న భావన మనసులో గట్టిగా ఉంటే చేసిన తప్పుడు పనులకు భాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి పశ్చాత్తాపం కలిగి, క్రమంగా మార్పు వస్తుంది. ఇంకెప్పుడు తప్పు చేయము.

యువతనే తీసుకోండి. మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం, వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఫ్యాషన్, ఆధునికత అని సమర్ధించుకుంటూ పతనం అవుతున్నారే కానీ, తప్పు చేస్తున్నామనే భావన, చేసిన దానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒక యువతే కాదు, ఎవరైనా. మన ప్రవర్తనతో, మాటలతో, లేక ఇతర విధానాల ద్వారా ఇతరుల పట్ల చేసిన అపరాధాలను అహంకారంతో వెనకేసుకురాకుండా, చేసినదానికి సిగ్గు పడాలి. ఎవరో చుశారని కాదు, ఎవరికో తెలుస్తుందని కాదు. నువ్వు చేసిన తప్పులు ఆధ్యాత్మిక మార్గంలో అవరోధాలుగా మారి, నిన్ను భగవంతుని నుండి దూరం చేస్తాయని. మానవజన్మ రావడమే ఎంతో కష్టం. అందులోనూ భగవంతుని మీద భక్తి కలగడం ఇంకా సుకృతం. వచ్చిన జన్మను సద్వినియోగం చేసుకుని పరమాత్మను చేరాలే కానీ, ఈ అవకాశాన్ని విడుచుకుంటే, ఇంకొన్ని కోట్ల జన్మలవరకు వేచి ఉండవలసి వస్తుంది. అప్పుడు కూడా మోక్షం వస్తుందని చెప్పలేం. ఇదే మంచి అవకాశం. ఇంత మంచి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నామని బాధ మొదలైతే, చేసిన తప్పులు సిగ్గు పడతాం, దాని నుండి పశ్చాత్తాపం కలిగి, చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే యజ్ఞవల్క్య మహర్షి హ్రీః - పశ్చాత్తాపం కలిగి ఉండటం, చేసిన తప్పులకు సిగ్గు పడటం ధర్మాన్ని ఆచరించేవారికి ఉండవలసిన లక్షణం అని ఉద్భోదించారు.

To be continued ............

1 comment:

  1. నీకు నువ్వుగా చేసిన తప్పును తెలుసుకుని, నడవడికను మార్చుకోవడం ఉత్తమ లక్షణం.

    ReplyDelete