Saturday 14 June 2014

హిందూ ధర్మం - 83

ఈ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యారని శతానందమహర్షి శ్రీ రామ, లక్ష్మణులకు వివరించారు. తన మార్గంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, అన్నిటిని ఎదురుకుని, ఎన్నో మార్లు విఫలమైనా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు కామక్రోధాది అరిషడ్వర్గాలకు బానిసైనా, తన సంకల్పబలంతో సకల దుర్గుణాలను గెలిచారు. ఈ విశ్వామిత్ర మహర్షే గాయత్రిమంత్రాన్ని సమాధి స్థితిలో దర్శించి, లోకానికి అందించారు. అటు తర్వాత శ్రీ రామ, లక్ష్మణులను తనతో పాటు యాగనిమిత్తం తీసుకువెళ్ళి, పరమశివుడి ద్వారా తనకు వచ్చిన ధనుర్వేదాన్ని రామలక్ష్మణులకు నేర్పించి, లోకకల్యాణానికి బాటలు వేశారు.

కోపం వ్యక్తి యొక్క స్థానాన్ని దిగజారుస్తుంది, సాధనను వృధా చేస్తుంది, ఆధ్యాత్మిక జీవనంలో అడ్డుపడుతుంది. ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి కోపం వస్తుంటుంది, అయితే అది ఎంత సేపు ఉంటుందన్న దాన్ని ఆధారం చేసుకుని మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.

ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం
అధమంచ అహోరాత్రం పాపిష్టే మరణాంతకః

ఉత్తముడైన వాడికి కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. త్వరగా కోపగించుకోరు, ఒకవేళ ఆ పరిస్థితికి వచ్చినా, వెంటనే తగ్గిపోతుంది. రెండవస్థాయి వారికి 48 నిమిషాల వరకు ఉంటుంది. వీరు మధ్యములు. అధములకు కోపం వస్తే ఒక రాత్రి, ఒక పగలు అంటే ఒక రోజంతా ఉంటుంది. పాపిష్టివారని ఉంటారు. వారికి జీవితాంతం, మరణించే వరకు ఉంటుంది. ఇవి మన పూర్వీకులు చెప్పిన మాటలు. వీటిని గుర్తుంచుకుని మనం ఎక్కడ ఉన్నామో, గమనించుకుని, జీవితాలను సంస్కరించుకోవాలి.

జీవించి ఉనంతకాలం ఎప్పుడు వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, అప్పట్లో అదంతా వాడి వల్లనే అయ్యిందంటూ పాపిష్టివాళ్ళు జీవితాంతం ఇతరులను తిట్టుకుంటూనే ఉంటారు. అది చుట్టు ఉన్నవారి మనసులను కలుషితం చేయడమే కాక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు సరికదా, సదరు వ్యక్తి అంటే అందరికి అయిష్టం పుడుతుంది. ఆ వ్యక్తి మీద గౌరవం పోతుంది.

To be continued ....................

No comments:

Post a Comment