Saturday 21 June 2014

హిందూ ధర్మం - 89 (నిజమైన పశ్చాత్తాపం)

వందలమంది నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఉగ్రవాది 'నాకు బ్రతకాలని వుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించి ప్రాణబిక్ష పెట్టండి' అని వేడుకున్న సందర్భాలు మనం చాలా చూశాం. నిజంగా అది పశ్చాత్తాపం అంటారా? ఆ ఉగ్రవాది చేసిన మారణకాండను వేలమంది జనం ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సాటి మనుష్యులని జాలి కూడా చూపించకుండా, మూర్ఖత్వంతో ప్రవర్తించాడు. అతను చేసిన దానికి, ఒక్కసారేమిటి వందల సార్లు ఉరి తీసినా, తప్పులేదు. కానీ పశ్చత్తాపడుతున్నాడని చెప్పి, నాటకం ఆడుతున్నాడు. అతను చేసిన తప్పుకు బాధపడడంలేదు, ఉరిశిక్ష పడిందని మరణభయంతో నాటకాలు ఆడుతున్నాడు. అతనిలో కలిగిన భయం అతని జీవితాన్ని రక్షించుకోవడం కోసమే, అది సెల్ఫ్ డిఫెన్స్. నిజంగా పశ్చాత్తాపడేవాడైతే, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడినా, అయ్యో నేను ఎంత మంది పొట్టనబెట్టుకున్నాను, నా వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, వాళ్ళను చంపినప్పుడు ఎంత బాధ వళ్ళు అనుభవించి ఉంటారో, నన్ను చంపినా తప్పులేదు అని నిరంతరం ఆవేదన చేందుతాడు. అతనికి వేరే శిక్ష అవసరంలేదు, పశ్చాత్తాపమే అతన్ని నిలువునా కాల్చి వేస్తుంది. కానీ ఉగ్రవాదుల్లో ఇటువంటి మార్పు కలగదని చెప్పుకోవచ్చు.

ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, ఒక వ్యక్తి రాత్రి సమయంలో తన స్కూటర్ మీద వెళుతున్నాడు. రోడ్డు మధ్యలో చిన్న కుక్కపిల్ల పడుకుని ఉంది. అది గమనించకుండా అతని దాని మీద నుంచి బండి నడిపించాడు. బండి రెండు చక్రాలు దాని శరీరం మీద నుంచే వెళ్ళగా, అది గట్టిగా అరించింది. కానీ బ్రతికింది. ఈ సంఘటన ఎవరు చూడలేదు. అతను బండి ఆపకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి బాధపడి, దగ్గర్లో ఉన్న పురోహితుని వద్దకు వెళ్ళి, విషయం చెప్పగా, నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగే పాపం కూడా తెలిసి చేసిన, తెలియక చేసిన, ఫలితం అనుభవించవలసిందేనని గట్టిగా చెప్పారు. ఇప్పుడు వ్యక్తి తనకు ఎప్పుడో శిక్ష పడుతుందని భయపడి, నేను ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి, ఏం దానమివ్వాలని, చేసినదానికి బాధపడితే, అది పశ్చాత్తాపం అవుతుందని చెప్పలేం. 'నేను ఎంత పని చేశాను. రోడ్డు సరిగ్గా చూడకుండా బండి నడిపాను. నా బండిచక్రాల క్రింద అది నలగడం వల్ల దానికి ఎంత బాధ కలిగిందో, దాన్ని నేను ఇంటికి తెచ్చుకుని వైద్యం చేయిస్తే బాగుండు' అని భావించి, ఆ సంఘటన తలుచుకున్న ప్రతిసారీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, ఆనాడు అది అనుభవించిన బాధను ఇతను నిరంతరం అనుభవిస్తూ, నేను చేసిన పాపానికి ఏ శిక్ష పడితే ఏంటి, దాన్ని ఎంతగా బాధపెట్టానో అని ఆవేదన చెందుతుంటే అది నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడ ఆత్మ రక్షణ కొంచం కూడా లేదు. తను ఇతరులకు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని, బాధించిన విధానాన్ని తలుచుకుని, అది తనకు జరిగితే ఎంత బాధాపడతాడో, ఇతరులకు జరిగినందుకు అంతే బాధాపడతాడు. ఇతరులు అనుభవించిన బాధనే తానూ అనుభవించడం, ఎవరూ శిక్షించకుండానే. అన్నిటిలో ఉన్న ఆత్మను అంగీకరిస్తేనే కానీ, ఈ స్థితి రాదు. ఇటువంటి పశ్చాత్తాపమే నిజమైన పశ్చాత్తాపం.      

To be continued ....................

No comments:

Post a Comment