Wednesday 18 June 2014

హిందూ ధర్మం - 87

అస్తేయం గురించి ఇంతకముందు చెప్పుకున్నాం. ఇంకొంత సులువుగా రోజువారి జీవితంలో ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఏ పని చేస్తున్నా, పనిని సక్రమంగా, నిజాయతీగా చేయాలి. ఆఫీస్‌కు సమయానికి వెళ్ళి, అక్కడ నిర్దేశించిన పనిని పూర్తి చేసుకుని రావాలి. పనియే దైవం అన్న సూక్తి ఉన్నమాట వాస్తవమే. ఏ పని చేస్తున్నా, అది ఈశ్వరునికి పూజగా భావించి చేయాలి. అంతమాత్రనా ఓవర్-టైం చేయమని అర్దం కాదు. ఆఫీస్ పనిగంటల్లో ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేస్తే చాలు. ఎటువంటి లంచాలు ఆశించకుండా, అక్రమాలకు పాలపడకుండా విధులు నిర్వర్తించాలి. ఇది అస్తేయం. అలా కాకుండా ఆఫీస్‌కు సమయానికి రాక, వచ్చినా పని పూర్తి చేయక, అక్రమాలకు పాల్పడడం స్తేయం. అంటే పాపం, అధర్మం.

నన్ను ఎవరు చూస్తారండి, దేవుడే నాకీ అవకాశాన్ని ఇచ్చాడు, అందుకే లంచాలు తీసుకుంటున్నాను అని కొందరు సమర్ధించుకుంటారు. కొందరు హుండీలో కాస్త అవినీతి సొమ్ము వేసి, పాపప్రక్షాలన జరిగిందని భావిస్తారు. మీరు తప్పు చేస్తున్నట్టు ఎవరో చూడనవసరంలేదు. మీలోనే ఒకడు ఉండి చూస్తున్నాడు, అన్నిటిని జాగ్రత్తగా ఎంతో చిత్రంగా, చాలా గుప్తంగా నమోదు చేస్తున్నాడు. వారినే చిత్రగుప్తుడు అంటారు. సూక్ష్మశరీరానికి ప్రతీక చిత్రగుప్తుడు. మనిషి మరణించిన తర్వాత అతను చేసిన పాపపుణ్యాల చిట్టాను బయటకు తీసేది ఈయనే. ఇక ఈయనకు తోడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైన భగవంతుడు ఉండనే ఉన్నాడు. వ్యక్తి మనసులో ఒక భావం జన్మించగానే అతనికి తెలిసిపోతుంది. అటువంటిది మనం చేస్తున్న పనులు పసిగట్టలేడా? మనం చేస్తున్న తప్పులు ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టుకోరు అంటూ మనల్ని మనం సమర్ధించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం.  ఇతరులను మోసగించడం ప్రక్కన పెట్టండి. ముందు స్వీయమోసం సంగతి ఏంటి?

ఒకడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, నేను వాడిని మోసం చేయలేను అని గట్టిగా సంకల్పించి, పరమాత్మను నమ్మి నీతిగా సంపాదించి జీవించడం అస్తేయం, సత్యం, ధర్మం కూడా. తద్విరుద్ధంగా జీవించడం పాపం. ఈ విధంగా మనుమహర్షి ధృతి, క్షమా, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ, విద్యా, సత్యం, అక్రోధః అనే పది ధర్మాలను వివరించారు. ఈ పది సామాన్య ధర్మాలనీ, వర్ణ, జాతి, ప్రాంతీయ బేధాలు లేకుండా, అందరూ వీటిని పాటించాలని తన స్మృతిలో పేర్కొన్నారు. ఈ పది ధర్మాలను పాటిస్తే, అతడు ధర్మాన్ని కొంతమేరకైన పాటిస్తున్నాడని గుర్తని చెప్పారు.

To be continued ................

No comments:

Post a Comment