Thursday, 10 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (17)సుగ్రీవ మహారాజా! ఈ రాముడు మహాప్రాజ్ఞుడు, దృఢ విక్రముడు, సత్యవిక్రముడూనూ. వీరి జనకుడు ఇక్ష్వాకు వంశాన జనించిన దశరథ మహారాజు. గొప్ప తపస్వి సత్యసంధుడు ఆడి తప్పినదిలేదు. తండ్రి యానతి తలదాలిచి అడవులకు వచ్చిన యీ రాముడు ధర్మమూర్తి ఇల్లాలితో, సోదరుడైన యీ లక్ష్మణునితో కలసి వచ్చాడు. భార్యను ఎవరో అపహరించారు. భార్యా వీయోగంతో రాముని అంతరంగం శోకతప్తమయింది. నీ సాయం కోరి వచ్చిన వీరిని ఆదరించు. వీరి సఖ్యం నీకు అవశ్యం. ఈ తేజశ్శాలుర సన్నిహితం నీకు కొండంత అండ అని చక్కని పద బంధాలతో ముందు ముందు నీవు సుఖజీవనం చేయటానికి వీరి అవసరం ఎంతో ఉందిసుమా అని నర్మగర్భంగా చెప్పగా సుగ్రీవునికి వేయి ఏనుగుల బలం వచ్చినట్లయినది. గుండె బెదరు అడగినది. ఈవిధముగా రామ సుగ్రీవులకు పవిత్ర మైత్రీ బంధం కలిగించిన తీరు లోకోత్తరమైనది. భావితరాలవారికి ఒక కొత్త బాట నేర్పరచినట్లయినది .


ఒక చల్లని మాట - ఓదార్పు


అనుకున్న ప్రకారము వాలి వధ జరిగినది. ఈ వృత్తాంతమును సరగున పరుగిడి వానరులు తారకు తెల్పిరి. మూర్తీభవించిన శోక దేవతాలావచ్చి తార భర్త శరీరమును చూచి అతి దీనముగ విలపింపసాగినది ఆప్రాంతమంతా ఎటుచూసినా విషాదమే. ఎవరికీ తారను ఓదార్బుశక్తి - ఆమెదగ్గరకు వెళ్ళగల ధైర్యము లేకపోయినది. అంతలో సమయోచిత సంభాషణా చతురుడగు ఆంజనేయుడు తారనుచేరి-శ్రవణ సుభగములైన మాటలతోఇటుల నసునయించినాడు.


గుణదోష కృతం జంతుః స్వకర్మ ఫలహేతుకం

అవ్యగ్ర స్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభా శుభం 

శోచ్యా శోచసి కం శోచ్యం దీనం దీనానుకంప సే 

కస్య కోవా శోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. 

జాతస్య నియతామేనం భూతానామాగతిం గతిం 

తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితే నేహ లౌకికం. 

అంగదస్తు కుమారోయం ద్రవవ్యో జీవపుత్రయా 

ఆయత్యాం చ విధేయాని సమర్ధాన్యస్య చింతయ. 


దేహి తాను చేసిన మంచి, చెడు పనుల ననుసరించి వానికి తగిన ఫలితముల ననుభవించును. జీవితం క్షణ భంగురం. నీటి బుడగ. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. అనివార్యమైన యీ జనన మరణాలను గురించి నీవంటి విజ్ఞత గలవారు ఇలా ఏడ్వ వచ్చునా! గతాన్ని మరచి కర్తవ్యాన్ని ఆలోచించు. ఉన్న కుమారుని అంగదుని చూచైనా దుఃఖాన్ని దిగమ్రింగు'. ఈ ఓదార్పు వలన తార ఊరడిల్లినది.. 


తారా విలాపాన్ని ఆచటివారెవరూ ఆపలేకపోయారు. సరి కదా దరిజేరి ఓదార్చ ప్రయత్నమూ చేయలేకపోయారు. ఒక చల్లని మాటతో ఆమె దుఃఖాన్ని మరపింప ప్రయత్నించలేదు. కన్నీరు మున్నీరుగా విలపించే తారను తన చల్లని మాటతో- అంటే ఉపశమనం కలిగించే మాటలతో ఓదార్చాడు. ఆ ఓదార్పు ఆమెను కర్తవ్యోన్ముఖురాలిని చేసింది. 


No comments:

Post a Comment