Monday, 28 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (35)



బుద్ధి విశేషంతో భ్రాంతిని వీడాలి.


అంతఃపుర భవన సముదాయమంతా కలయచూస్తున్నాడు. అది ఎంత మనోహరమో అంత భయం కల్గిస్తున్నది. అరివీర భయంకరులైన రక్షక భటుల పర్యవేక్షణలో వుంది. ఆ ప్రాంతాన తిరుగుటన్న కత్తి అంచుమీద నడకన్న మాటే. ఒకవంక సింగారంగా శోభిల్లే యువతీ లలామలు, మరోవంక మత్తెక్కించే కల కూజితాలు- ఇంకోవంక సరోవరాలూ - వాటిచెంత ఫల పుష్పభరిత వృక్షాలతో ఉద్యానవనాలు- నవరసా లోలికిస్తూ ప్రకృతి శోభతో పరవశింప చేస్తున్నది. ఆయా ప్రదేశాలను మారుతి సీతకై కంట వత్తిడుకొని ఎంతగ వెదకినా సీత జాడ తెలియరాలేదు.


ఇంతలో మారుతి చూపులు ఒక విశాల భవనంపై బడినై. అదే రావణ మందిరం. పుష్పకం అను పేరుగల విమాన భవనం. కనులు మిరుమిట్లు గొలుపు ఆ భవనాన అడుగిడి వెతకడం మొదలు పెట్టాడు. ఒకచోట హంసతూలికా తల్పంపై నిదురించే నల్లని పర్వతాకారుడు లంకేశ్వరుడు రావణుని చూచాడు. ఆశ్చర్యంగా తదేకంగా కొంత తడవు చూచాడు. అతని దృష్టి మరో పర్యంకంపై బడింది. ఆ తల్పంపై అతిలోక సుందరి పట్టమహిషి మండోదరి నిదురిస్తున్నది. ఉత్తమ స్త్రీ లక్షణాలను ఊహించి అవన్నీ ఈమెలో కన్పడగా రాముని ఇల్లాలు సీత కాబోలు నను కున్నాడు. సంతోషించాడు. ఇంత కష్టం తానెవరికై పడుతున్నాడో- ఆ మూర్తిని కనులముందు కాంచగనే ఉక్కిరి బిక్కిరైన ఆనందం కలిగింది. ఆ దృశ్యాన్ని ఆదికవి వాల్మీకి పరమ రమణీయంగా వాస్తవానికి అద్దం పట్టినటుల వర్ణించాడు.


ఆస్ఫోటయామాన చుచుంబ పుచ్ఛం 

ననంద చిక్రీడ జగౌ జగామ 

స్తంభానరోహన్ నిపపాత భూమౌ 

నిదర్శయన్ స్వాం ప్రకృతిం కవీనాం.


తన వాలాన్ని నేలపై కొట్టాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్తంభం మీదనుండి యీ స్తంభం మీదకు దూకాడు. గంతులు వేశాడు. ఆనందంతో కోతి స్వభావాన్ని చూపిస్తూ ప్రవర్తించాడు.


ఇదొక భ్రాంతి కొన్ని కొన్ని సమయాలలో- వారెంతవార యినా భ్రాంతికి లోనవ్వటం సహజం. ఐతే సామాన్యులు యీ భ్రమకు లోనై అధఃపాతాళమున కంటుకు పోవుట సత్యదూరం కాబోదు. ఆంజనేయుడు మరుక్షణం మతిమంతుడై ఆలోచనలో పడి పొరబాటును గమనించి నేనెంత పొరపడ్డాను. కాంతుని వీడి సీత పరగృహంలో, పరుని సమక్షంలో హాయిగా అదమరచి నిదురించునా ! ఆభరణములను తాల్చునా! అన్నపానీయముల నారగించునా! ఎంతటి భ్రమకు లోనయ్యాను. ఈమె సీత కాదు, మరెవరోనై యుండవలె అని ఖిన్నుడై మరల కర్తవ్యోన్ముఖుడయినాడు, ఇటువంటి సమయాలలో సమయజ్ఞత, ఆలోచనా పాటవం కలిగి ఉండాలి.    

2 comments:

  1. Pineal Gland అని ఆధునిక శరీర విజ్ఞాన శాస్త్రం దేన్ని అంటుందో దాన్ని భారతీయ ప్రాచీన విజ్ఞాన శాస్త్రం ఏమని పిలిచింది?

    దానిమీద ఒక పోష్టు వేద్దామని కూర్చుంటే ఈ చిన్న డౌటుతో గూగుల్ మొత్తాన్ని గాలించి కూడా ఫెయిలయ్యాను!

    చిన్నప్పటి తెలుగు మీడియం పుస్తకాలలో ఉండి ఉంటుందని నా అనుమానం.మీకు దగ్గిరలో తెలుగు మీడియం పోరగాళ్ళు ఉంటే వెతికి పట్టుకుందురూ...!

    ReplyDelete
    Replies
    1. అలాగే అండి, కొందరు పినీయల్ గ్లాండ్ ని మనవాళ్ళు ఆజ్ఞాచక్రం అన్నారని చెబుతారు, కానీ షట్చక్రాలు భౌతికమైన భాగాలు కావు.

      Delete