Friday 17 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 104 వ భాగం



అజప- హంసనటనం


శివతాండవాలు పెక్కువిధాలుగా ఉంటాయి. చిదంబరంలో ఆనంద తాండవం. తిరువలంగాడులో ఊర్ధ్వతాండవం. ఇక చోళ ప్రాంతంలో ఏడుగురు త్యాగరాజులు ఏడు రకాలైన తాండవాలు చేస్తారు. వీటిని సప్తవిడంగ క్షేత్రాలని అంటారు. అందు ముఖ్యమైనది తిరువారూర్. ఇందున్న త్యాగరాజు, అసలైన మూర్తి. ఇతని నృత్యాన్ని హంసనటనమంటారు. ఇదే అజపానటనం.


జపం కానిది అజపం. మంత్రంలోని అక్షరాలను పల్కుతాం. ఆ కంపనల వల్ల నాడులలో కదలిక ఏర్పడుతుంది. దీనివల్ల శక్తి, సిద్ధి, మనస్సునకు స్పష్టత, అనేక దృశ్యాలు కన్పిస్తాయి. ఇవి రావాలంటే ప్రాణాయామంతో కలిపి చేయాలి. దీని కంటె భిన్నమైన ప్రక్రియ యుంది. శ్వాసను గమనిస్తూ ఉంటే చిత్తానికి శాంతి ఏర్పడుతుంది. ప్రాణాయామంలో శ్రమ యుంటుంది. కాని ఈ ప్రక్రియ అప్రయత్నంగా సాగిపోతూ ఉండడాన్ని గమనిస్తాం. ఇది ఆత్మస్థానాన్ని చేరుస్తుంది. ఇందు మంత్ర జపం ఉండదు. అందువల్ల అజపం, వట్టి శ్వాస యొక్క గమనాన్ని వీక్షించడమే.


మామూలుగా దీనినీ జపం అంటాం. ఇదే హంస మంత్రజపం. పీల్చేటప్పుడు, విదిలేటప్పుడు ఇస్ హం, అనే నాదాలుంటాయి. అహంసః = నేను అతడే. నేను జీవాత్మ, అతడు పరమాత్మ. నేను, అతడు అని ఊరుకుంటే బ్రహ్మయే జీవుడనే, అర్థం వస్తుంది. అతడు, నేను అనినపుడు సః అహం. కలిపితే సోహం. సోహంను హంసతో కలిపితే హంసమంత్రం. ఇట్లా జీవుణ్ణి పరమాత్మతో కలిపినపుడు జపమాగిపోయి, అజపమౌతుంది. స, హ, అణగిపోయి ఓం, ఒక్కటే మిగులుతుంది. అది తురీయస్థితికి తీసుకొని వెడుతుంది.


విష్ణువు, కుండలినియైన పామును తల్పంగా చేసుకొని యోగనిద్రలో, పరమాత్మతో ఐక్యమై పరమేశ్వర రూపాన్ని పొందుతున్నాడు. మహావిష్ణువు యొక్క శ్వాసగతిననుసరించి పరమేశ్వరుని కదలిక యుండడం వల్ల దానిని త్యాగరాజు యొక్క అజపానటనమని, హంసనటనమని అంటారు.


No comments:

Post a Comment