ఇక చంద్రశర్మ, జ్ఞానోపదేశం పొందడానికి మహాభాష్యం అందించిన గురువు కోసం వెదకడం మొదలు పెట్టాడు. తన విద్యా గురువయిన గౌడుడు శుకుడి దగ్గర సన్న్యాసం తీసుకొని హిమాలయాల్లో ఉన్నాడని తెలిసి సమీపించాడు. ఇపుడు విద్యాగురువే సన్న్యాసి గురువైనాడు. దీక్షానంతరం, చంద్రశర్మ గోవింద భగవత్పాదులయ్యాడు. జగద్గురువైన కృష్ణుని ఉన్న నామాల్లో గోవిందుడొకటి. ఆచార్యుల గురువు గోవింద భగవత్పాదుల పేరులో కూడా గోవింద నామం ఉంది. అందుచేత ఆచార్యులకు గోవిందనామం అంటే ప్రీతి. అందుకే భజగోవింద స్తోత్రంలో శంకరులు భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం అని మూడుసార్లు అన్నారు.
గురు పరంపరంలో సన్న్యాసులు
నారాయణుని నుండి శుకుని వరకూ ఎవ్వరూ సన్న్యాసి గురువులు కారు. కాషాయం, ముండనాదులు లేవు. నారాయణుడు, బ్రహ్మ, దేవతలకు ఆశ్రమాలుండవు. ఇక వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు ఋషులే. కాని వీరిని కేవలం మనుష్య జాతిగా పరిగణించం. వీరు మంత్రద్రష్టలు. కనుక మానవాతీతులు. దేవతలకూ, మనుష్యులకు వీరు మధ్యనుంటారు. కనుక వీరు సన్న్యాసులు కారు. ఆత్మసిద్ధిని పొందిన వారు. శుకుడు, శిరో ముండితుడని చెప్పబడలేదు. ఆయన అవధూత లేక దిగంబరుడు.
దిక్కులే అంబరంగా అనగా బట్టగా ఉన్నవాడు. కనుక దిగంబరుడు. వస్త్రాన్ని విడిచి పెడితే శరీరం చుట్టూ దిక్కులే యుంటాయి. అట్టివాడు శుకుడు.
నిర్వాణం
గాలిని ఊది దీపం ఆర్పడాన్ని నిర్వాణం అంటారు. అగ్నికి ఉన్న శక్తి నీటికీ, గాలికీ కూడా లేదు. ఒక నిప్పురవ్వ మొత్తం అంతా కాల్చగలదు. అట్టిదానిని కేవలం రూపు లేకుండా చేయవచ్చు.
No comments:
Post a Comment