Tuesday, 21 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 108 వ భాగం



యజ్ఞ నారాయణ దీక్షితుల సాహిత్య రత్నాకరంలో (11.124) పాణిని సూత్రానికి, పతంజలి భాష్యానికి నటరాజు యొక్క చేతులకు, కాళ్ళకు గల సంబంధం చెప్పే చమత్కార శ్లోకం ఉంది.


పాణియనగా చేయి. నటరాజు చేతిలోనున్న డమరుకం నుండి పాణిని సూత్రాలు వచ్చాయి. మరి కాలికి, భాష్యానికి సంబంధం ఏమిటి?


నిలబడిన నటరాజు నృత్యాన్ని చూడటానికి తృప్తి పడక పతంజలి పామై అతని పాదానికి ఆభరణమై యున్నాడు. ఆ అందె నోటినుండి మహాభాష్యం వచ్చింది. అందె చప్పుడు చేస్తుంది కదా!


సూత్రం చేతినుండి వస్తే, భాష్యంకాలి నుండి వచ్చిందని చమత్కారం.


వేయిమంది శిష్యులకు పాఠం


చిదంబరంలోని సహస్రస్తంభ మంటపంలో ఆదిశేషుడు పతంజలి అవతారమెత్తి వేయిమంది శిష్యులకు భాష్యం అందించదలచాడు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపించాలి. పాఠాన్ని త్వరగా ముగించాలి. ఎవరడిగినా వారికి సమాధానం ఈయాలి. ఇట్లా చేయడానికి ఒక ముఖంతో ఒక నోటితో కుదరదు కనుక పతంజలి మహర్షి, ఆదిశేషుని అవతారమెత్తి వేయి పడగలతోనున్నాడు.

మానవులు ఎవరూ ఆదిశేషుణ్ణి చూడలేరు కనుక, అతని శ్వాసను కూడా భరించలేరు కనుక, ఒక తెరను కట్టి, ఒక్కొక్క ముఖము ముందు ఒక్కొక్క శిష్యుణ్ణి కూర్చోబెట్టి, పాఠం చెప్పడం మొదలు పెట్టాడు.

గురువు తెర వెనుక ఉన్నప్పుడు శిష్యులు తరగతి విడిచి ఆయన అనుమతి లేకుండా వెళ్ళినట్లయితే బ్రహ్మరాక్షసులవుతారని శాపం చెప్పాడు.

No comments:

Post a Comment