విష్ణుని హృదయంలో శివనర్తనం
నటరాజ ఆలయంలో నటరాజ దర్శన మంటపం దగ్గరనే విష్ణు సన్నిధి యుంటుంది. ఆదిశేషునిపై పవళిస్తున్నట్లు గోవింద రాజుగా కీర్తింపబడి యుంటాడు. అప్పయ్య దీక్షితులు, ఇద్దరూ ఒకచోట ఉండడం చూసి 'మారమణ, ఉమారమణ' అని ఇద్దర్నీ కీర్తించారు.
హృదయ పూర్వకంగా బంధుత్వం అంటాం. ఇక్కడ నటరాజు, మహావిష్ణువు హృదయంలో నర్తిస్తాడు.
పురాతన పరిశోధనలు చేసేవారు. తిరువారూర్ లో నున్న త్యాగరాజాలయాన్ని చూసి విష్ణునకు రంగరాజు, వరద రాజు, గోవిందరాజు అని ఉంది. కనుక, పై ఆలయం ముందు విష్ణువుదే అని తరువాత శివాలయంగా మార్చబడిందని అంటారు. అట్లాగే నాచ్చియార్ కోవెల ముందు శివాలయమని, తరువాత వైష్ణవాలయంగా మార్చబడిందని అంటారు. ఏమిటో ఈ పరిశోధన?
వారు స్థల పురాణాలను సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. ఎట్టి మార్పును చెప్పనవసరం లేదు. అవి ముందెట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. విష్ణ్వాలయంగానే తిరువారూర్ లో నిర్మింపబడింది. విష్ణు హృదయంలో త్యాగరాజున్న మూర్తి అక్కడ ఉంది.
నటరాజు మాదిరిగా త్యాగరాజు కూడా నటనమూర్తియే. అయితే అతని ముఖమే చూడగలం. మిగతా మూర్తి అంతా వస్త్రంచే కప్పబడి యుంటుంది. నటరాజు, త్యాగరాజుల నర్తనంలో తేడా ఉంది. నటరాజు నృత్యం చేస్తూ ఉంటే ఎడమకాలిని ఎత్తి నృత్యం చేస్తాడు. త్యాగరాజు తనంతట తాను చేయడు. అతడు విష్ణు హృదయంలో ఉన్నాడు. కాబట్టి విష్ణువు, శ్వాస పీలుస్తూ ఉంటే దానికి అనుగుణంగా త్యాగరాజు నృత్యం చేస్తాడు. ఆ కదలికయే నృత్యం.
విష్ణు హృదయంలో శివుడు నృత్యం చేస్తాడని నారాయణోపనిషత్తు చెబుతోంది. సహస్ర బాహువులు, సహస్రాక్షులు కలిగిన ఆ విరాట్ స్వరూపానికి హృదయం, పద్మకోశంలా అనగా తామర మొగ్గలా ఉంటుందట. దానిపై దహరాకాశం, అందు పరమాత్మ ప్రకాశిస్తాడని మంత్రం అంటోంది. బైట ఉన్నది, మహాకాశం, దానిలో నున్నది దహరాకాశం. చిదంబరంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగే యుంటుంది. జ్ఞానాకాశము, ఆకాశక్షేత్రము, చిత్సభ, తాండవమూర్తియైన నటరాజ శివుడు. అన్నిటికీ సంబంధం ఉంది.
No comments:
Post a Comment