Wednesday 8 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 95 వ భాగం



ఆదిగురువు, దక్షిణామూర్తి. ఆయన ఎవరికీ ఉపదేశమిచ్చినట్లు లేదు. గురు పరంపర, విష్ణువుతో ఆరంభమౌతుంది. మరొక శ్లోకంలో పరమ శివుడే దక్షిణామూర్తి కనుక విష్ణువును విడిచి యుంటుంది, ఆదిగురువు పరమశివుడు, మధ్య గురువులు, తరువాత శంకరులు, తరువాత మనకుపదేశమిచ్చిన ప్రత్యక్ష గురువు పేర్లను చెప్పి నమస్కరిస్తారు.


"సదాశివ సమారాంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతం వందేగురు పరంపరామ్"


మొదటి శ్లోకం ప్రకారం విష్ణువు, బ్రహ్మ, ఇత్యాదిగా ఉంటుంది. విష్ణువు, బ్రహ్మకు వేదాలనిచ్చాడు కనుక ముందు విష్ణువు, తరువాత - బ్రహ్మ - వసిష్ఠుడు - శక్తి పరాశరుడు - వ్యాసుడు తరువాత, ఆయన కొడుకైన శుకుడు. అతడు వివాహమాడలేదు కనుక శిష్యుడైన గౌడపాదుడు గోవింద భగవత్పాదులు - చివరకు శంకరులకు వందనం సాగి, వీరి శిష్యులైన నల్గురు శిష్యులను పేర్కొంటూ మనకు ప్రత్యక్షంగా ఉపదేశమిచ్చిన గురువునకు వందనంతో ముగుస్తుంది.


మామూలుగా మనం చెప్పుకునే ప్రవరలో గోత్ర ఋషులను పేర్కొని తరువాత నున్న వారెవరో తెలియదు కనుక వారిని విడిచి కేవలం ముత్తాత, తాత, తండ్రులనే పేర్కొంటాం. కాని బ్రహ్మవిద్యా విషయంలో విష్ణువు నుండి ప్రత్యక్ష గురువు వరకూ పేర్కొంటాం. శంకరుల వరకు అవిచ్ఛిన్న పరంపర సాగింది. వరుసగా శంకరుల ముందు తొమ్మండుగురు పూర్వాచార్యులున్నారు. అయితే ఏనాటి విష్ణువు? ఏనాటి శంకరులు? యుగయుగాలు గడిచి పోయాయి. తొమ్మండుగురునే చెబుతున్నారేమిటని శంక.


వసిష్ఠాదులు దీర్ఘకాల జీవులు. వసిష్ఠుడు, వేదంలో, రామాయణంలో పేర్కొనబడినవాడు. మన కాలమానంతో, మన ఆయుర్దాయంతో లెక్కపెట్టగూడదు. వ్యాసుడు చిరంజీవియే కదా. వారిని చారిత్రక వ్యక్తులని మిడిమిడి జ్ఞానంతో చూడకూడదు. ఇది వివరిస్తూ ఉంటే మధ్యలో ఆదిశేషువు, పతంజలి కథలు వస్తాయి.

No comments:

Post a Comment