విష్ణువు, పతంజలిని చిదంబరానికి వెళ్ళమన్నాడు. దానివల్ల లోకానికి ఉపకారం జరిగింది. నటరాజు చేసిన డమరుక నాదాన్ని విని పాణిని మహర్షి వ్యాకరణ సూత్రాలు వ్రాసేడు. దానికి మహాభాష్యాన్ని వ్రాసి లోకానికి ఉపకరించవలసిందిగా ఆదిశేషుడిని విష్ణువు పంపించాడు.
విష్ణువు, పాముపై పవ్వళించినపుడు అతనికి తల్పంగా; అతడు కూర్చుంటే సింహాసనంగా, నడుస్తూ ఉంటే గొడుగుగా, పాము ఉపయోగపడుతుంది. అయితే విష్ణువు నృత్యం చేయడు. శివుడే చేస్తాడు. నృత్యం చేసేవానికి పామెట్లా ఉపకరిస్తుంది? అది ఒక ఆభరణంగా శివునికైనపుడే. అందుకే అతని కాలియందెగా అయ్యాడు. పతంజలి మహర్షిగా నటరాజును సమీపించాడు. అపుడు విష్ణువునకు తల్పంగా లేడని భావించవద్దు. ఒక అంశ అట్లా వెళ్ళింది.
పతంజలి, అత్రిమహర్షికి పుట్టాడు. కనుక అతడు, ఆత్రేయుడు. (ఆచార్యులు వారి గోత్రం కూడా ఇదే)
ఇతనికి గోణికా పుత్రుడని పేరు. పతంజలి చరిత్ర ననుసరించి, పురాణాల ప్రకారం గోణిక అనే తపస్వినికి పుట్టాడని, పతంజలిగా అవతరించాడని ఉంది. గోణీక, పుత్రునికై, సూర్యునకు అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆమె అంజలిలో ఆదిశేషుడు పడి అతడు పతంజలి అయ్యాడని కథ. అంజలిలో పత్ = పడుటవల్ల పతంజలి, ఇతనికే చరకుడని పేరు. నటరాజు తాండవాన్ని చూస్తూ ఉండేవాడు. అతడే మహాభాష్యం వ్రాసేడు.
No comments:
Post a Comment