Thursday, 23 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 110 వ భాగం



శిష్యునిపై అనుగ్రహం


శిష్యుడు గురువుల ఎదురనున్న బూడిద కుప్పల భయంకర దృశ్యాన్ని చూసాడు. చెప్పిన పాఠాలు వ్యర్ధమయ్యాయని గురువు, బాధపడ్డాడు. గురు వాక్యాన్ని ఉల్లంఘించానని ప్రమాదం ముంచుకొస్తోందని శిష్యుడు భయపడ్డాడు. పోనీ ఒక్కడైనా మిగిలాడని గురువు సంతోషించి అతనిపై అనుగ్రహ శక్తిని ప్రసరించి వ్యాకరణ శాస్త్రాన్ని పూర్తిగా బోధించాడు.


అట్టి మహాత్ములు నేటికీ ఉంటారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుని అనుగ్రహించలేదా? ఎప్పుడో గాని అట్టి శక్తిని చూపించరు. అయితే ఇంతకు ముందు పెట్టిన నియమం ప్రకారం, అతడు బ్రహ్మ రక్షస్సు కావలసిందే. ఇతడు విద్వాంసులను భక్షించడం ఖాయమే. ఎవరైనా సరియైన సమాధానం ఇస్తే అపుడు వచ్చేవానికి మహాభాష్యాన్ని ఇతడు చెప్పాలనే నియమాన్ని పతంజలి ఏర్పాటు చేసాడు. అప్పుడితడికి శాపవిమోచనం కల్గుతుందని అన్నాడు.


సంస్కృతంలో ప్రత్యయాలు సాధారణంగా చివర వస్తూ ఉంటాయి. 'కృ' అనే ధాతువునకు 'క్త' అనే ప్రత్యయం చేరితే, కృతం అవుతుంది. 'భుజ్’కి చేరితే భుక్తం. వీటిని నిషాంతాలని అంటారు. 'పచ్' ధాతువునకు 'క్త' చేరిస్తే పక్వమౌతుందిగాని 'పక్తం' అనకూడదు. అట్లా సరిగా చెబితే అతనికి భాష్యాన్ని ఉపదేశించు, లేదా తినివేయవచ్చు అని పతంజలి అన్నాడు.


బ్రహ్మ రాక్షసుడు నర్మదా తీరంలోని రావిచెట్టు మీద కూర్చుని 'పచ' ధాతువునకు 'నిష్ఠ'తో రూపం ఏమి వస్తుందో చెప్పుమని వచ్చేపోయే విద్వాంసులనడిగేవాడు. చెప్పనివాళ్ళని ఆహారంగా భోజనం చేసేవాడు. పంచగౌడ దేశీయులకు, పంచ ద్రావిడ దేశీయులకు మధ్యగా నర్మదా తీరం ఉంటుంది. ఇది ఒక కూడలి.


No comments:

Post a Comment