Thursday, 2 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 89 వ భాగం



సూర్యునకే సవితయని పేరు. సౌర పురాణం సూర్యుని గురించి చెబుతుంది.


ఆ సవిత, శంకరునిగా అవతరిస్తాడని, వ్యాస సూత్రాలకు సరియైన అర్థం వివరిస్తాడని, వేదసత్యాన్ని తత్త్వ రూపంలో అందిస్తాడని చెప్పింది.


"వ్యాకుర్వన్ వ్యాస సూత్రార్ధం ప్రతేరర్థం యథోచివాన్

శ్రుతేర్న్యాయ్యస్ప ఏవార్థః శంకరః సవితాననాః"

సూర్యమూర్తే ఇందు శంకరులుగా అవతరించినట్లుంది. సూర్యుడు చీకటిని పోగొడతాడు. జ్ఞాన సూర్యులైన శంకరులు, అజ్ఞానమనే చీకటిని పోగొడుతున్నారు. విద్వాంసులకు జ్ఞాన భాస్కరులని అంటున్నాం. శంకరుని శిష్యులలో ఇద్దరు, శంకరులను సూర్యునిగానే నుతించారు.


తోటకుడనే శిష్యుడు వీరినుద్దేశించి అహిమాంశురివాత్ర విభాసి అన్నాడు. హిమాంశువనగా చంద్రుడు. అహిమాంశువనగా సూర్యుడు. అతడే మంచును కరుగునట్లు చేస్తున్నాడు.


వీరి శిష్యులలో సురేశ్వరాచార్యులు, తన బృహదారణ్యక వార్షికంలో వీరిని జ్ఞాన సూర్యునితో పోల్చారు. అజ్ఞానమనే చీకటిని పోగొడుతున్నారని కీర్తించాడు. శంకర విజయంలోనే గాక ఋగ్వేదం, శివరహస్యం, మార్కండేయ సంహిత, విష్ణు ధర్మోత్తర, వాయు, కూర్మ, లింగ, భవిష్యోత్తర, సౌర పురాణాల్లో శంకరులు ఇట్లా అవతార మూర్తిగా ప్రశంసింపబడ్డారు.


ఎవరైనా స్తోత్రాలు వ్రాయవచ్చు, తత్త్వాన్ని ప్రతిపాదించవచ్చు. కాని ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వం, నడవడి దగ్గరనున్న శిష్యులకో, సేవకులకో బాగా తెలుస్తుంది. అందుకే ఆంగ్లంలో 'No man is hero to his Valet' అనే మాట పుట్టింది. అందుకే శిష్యుల మాటలను పేర్కొన్నాను. 


No comments:

Post a Comment