పై మూడింటికి మూడు గ్రంథాల నందించాడు. చిత్త దోషాన్ని పోగొట్టడం కోసం యోగ సూత్రాల నందించాడు. అదియే పాతంజలయోగ సూత్రం. అనేక యోగాలున్నా పతంజలి యోగాన్నే రాజయోగమంటారు. శ్లోకంలో “యోగేన చిత్తస్య” ఉంది. దీనివల్ల జీవాత్మ, పరమాత్మతో ఐక్యాన్ని పొందుతాడు. తరువాత వాగ్దోషం పోవడానికి, సుశబ్దాల నుచ్చరించడానికి వ్యాకరణ మహాభాష్యాన్ని అందించాడు. "పదేన వాచం".
పదమంటే వ్యాకరణం. "పదం వ్యాకరణం ప్రోక్తం" మహా విద్వాంసులను పదవాక్య ప్రమాణ పారావార పారీణులని యంటారు. పదమనగా వ్యాకరణం; వాక్యమనగా మీమాంస; ప్రమాణమనగా న్యాయశాస్త్రం. వాటిల్లో ఉత్తీర్ణులన్నమాట.
దేవతలు మాట్లాడే భాష, దేవభాష. వారీ ప్రపంచాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు కనుక వారితో మాట్లాడాలంటే మనకా భాష రావాలి. అపుడు మంత్రాలు, శ్లోకాలు బాగా తెలిసి కర్మానుష్టానం బాగా జరుగుతుంది. అందువల్ల సంస్కృతాన్ని మనమందరమూ అభ్యసించాలి. వ్యాకరణ శుద్ధమైన భాషలో మాట్లాడడమే ఒక యోగం. నాడీశుద్ధి కల్గుతుంది. మానసిక పవిత్రత లభిస్తుంది. అందనేక ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి. మన సంస్కృతి తెలియాలంటే సంస్కృతం, తప్పనిసరిగా నేర్వాలి. "మలం శరీరస్యవైద్యకేన" అని ఉంది. శారీరక రోగాలను పోగొట్టడానికి ఆయుర్వేదాన్ని అందించాడు. అదే చరక సంహిత అనే ప్రసిద్ధ గ్రంథం. అందుకే అన్నిటి శుద్ధికోసం గ్రంథాల నందించాడు కనుక అతడు ముని ప్రవరుడయ్యాడు. మునులలో శ్రేష్ఠుడు. ప్రామాణిక గ్రంథాలు మూడు రకాలుగా ఉంటాయి. అనగా సూత్రం, భాష్యం, వార్షిక రూపంలో ఉంటాయి. సూత్రం, సూక్ష్మంగా, సంక్షిప్తంగా అందిస్తుంది. దానిని భాష్యం విపులంగా వివరిస్తుంది. భాష్యంలోని క్లిష్టమైన వాటిని వివరించేది వార్తికం. అనగా భాష్యంలో చెప్పనివాటినీ అందిస్తుంది. కొన్నింటిలో ఒక్కొక్కదానికి ప్రాధాన్యం ఉంటుంది. పతంజలి యోగ శాస్త్రానికి సూత్రాలు, వ్యాకరణానికి భాష్యం, వైద్యానికి వార్షికం వ్రాసేడు. ఇట్లా ఒక్కొక్క శాస్త్రంలో ఇతడు వ్రాసినవన్నీ ప్రాధాన్యాన్ని పొందాయి.
యోగ శాస్త్రానికి కొందరు భాష్యాలు వ్రాసినా ఇతని సూత్రాలే ప్రఖ్యాతి. పాణిని సూత్రాలు సామాన్యులకు అర్థం కావు కనుక ఇతని భాష్యానికే ప్రసిద్ధి. ఎన్ని వైద్య గ్రంథాలున్నా ఇతని చరకానికే ప్రసిద్ధి.
నాట్యానికి భరతశాస్త్రం, రాజనీతికి చాణక్యుని అర్థశాస్త్రం, ఎట్లా ప్రాముఖ్యాన్ని పొందాయో ఇతని చరకం వైద్యానికట్లా ప్రసిద్ధి పొందింది. యోగశాస్త్రాన్ని పూర్తిగా ఇతరులు ఏకీభవించకపోయినా దానిని ఒక ప్రధానాంగంగా అందరూ అంగీకరించారు. సిద్ధాంతం విషయమై, అద్వైతం కొంత విభేదాన్ని దీనితో కలిగి యుంది. కాని వ్యాకరణ మహాభాష్య విషయంలో ఎవ్వరికీ పేచీ లేదు.
No comments:
Post a Comment