Saturday 11 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 98 వ భాగం



గురుని ఆజ్ఞ ప్రకారం రామానుజులు, పరాశరునిపై భక్తిని చూపించి, వారి పేర్లు శాశ్వతంగా ఉండాలని, తన శిష్యుడైన కూరత్తాళ్వార్ యొక్క తనయునకు పరాశర భట్టర్ అను నామకరణం చేయించారు.


మూడు సంప్రదాయాలకు వ్యాసుడే మూల పురుషుడు. ముగ్గురు బ్రహ్మసూత్రాలపై భాష్యం వ్రాసేరు. మాధ్వులలో వ్యాసరాయర్ అనే వారున్నారు. వారికి వ్యాస రాయర్ మఠం కూడా ఉంది. అట్లాగే శుకుడు కూడా ముగ్గురికీ గురువే. తరువాత గురుపరంపర, విడిపోయింది. మన అద్వైత సిద్ధాంతం గౌడ పాదునితో మొదలౌతుంది.


శుకబ్రహ్మము


శుకుడు అద్వైత జ్ఞానం మూర్తీభవించిన జీవన్ముక్తుడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. చాలామంది జీవన్ముక్తులకు పూర్వ కర్మలు కొంతకాలం వెంట రావడం, వాటిని వీరు జ్ఞానంచే ఎదుర్కొనడం జరుగగా ఇతడు పుట్టుకతోనే జీవన్ముక్తుడయ్యాడు.


కర్మశేషం ఉండగా పుట్టలేదు. ఏ ప్రయత్నం లేకుండానే ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు.


పుట్టుక అంటే పూర్వకర్మ ఉండాలి. శాస్త్రప్రకారం కర్మలు చేయడం, చిత్త శుద్ధిని పొందడం, ఆత్మ జ్ఞానం అవసరముండడం ఉంటుంది. అజ్ఞానం లవలేశం అంటకుండా పరమేశ్వరుడితణ్ణి అవతరింప చేసాడు. ఇది వాని లీల. ఇంతకంటే కారణం చెప్పలేను. ఈశ్వర సృష్టిలో ఇది యొక ప్రత్యేకత. ఇట్టివారు కూడా ఉంటారని లోకానికి వెల్లడి చేయడంకోసం పుట్టించాడేమో!


అట్టివాడు, వామదేవుడు కూడా. శుకుని కంటె ముందువాడు. “దేవతల జన్మలు నాకు తెలుసు. అనేక వేల జన్మలనెత్తాను. నేడు లెక్కలొచ్చాయి. అవి గరుత్మంతుని రెక్కల వంటివి, అందుకే బంధాలు వదుల్చుకుని ఎగిరిపోతున్నాను" అని ఐతరేయ ఉపనిషత్తులో ఇది ఉంది. పూర్వం అనేక జన్మలెత్తానని, ప్రస్తుతం గర్భవాసంలో ఉండగానే ఆత్మజ్ఞానం కల్గిందని ఆయన చెప్పగలిగాడు. అట్టి పూర్వ జన్మలులేనివాడు శుకుడు.


No comments:

Post a Comment