Friday 3 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 90 వ భాగం



హస్తామలకుడు, హస్తామలక స్తోత్రంలో ప్రాణులు లేరు, దేహాదులు లేవు, ఉన్నది ఒక్కటే, ఆత్మస్వరూపమని చాటాడు. కనుక ఆచార్య స్వరూపమని, అవతార స్వరూపమని విడిగా ఉంటాయా? ఇక మిగిలిన ముగ్గురు శిష్యులు వీరిని పరమేశ్వరునిగానే భావించారు. జ్ఞాన సూర్యుడని అన్నారు.


తోటకుడు, అష్టకం చివరలో "భవశంకర దేశికమే శరణం" అన్నాడు. శంకరులను, శంకరునిగా చూస్తున్నానని అన్నాడు. ఈశ్వర నామాలలో భవుడని ఒక నామం. 'భవ'ను క్రియగా భావిస్తే అగుగాక అని అర్థం.


'భవ ఏవ భవాన్' అన్నాడు. భవాన్ అనగా నీవు భవుడవే, నీవు శివుడవే, శివుడే భవుడని అర్థం.


"భవ ఏవ భవాన్ ఇతిమే నితరాం

సమజాయత చేతసి కౌతు కతా".


శంకరులనొక మానవ మాత్రునిగా, గురువుగా మాత్రమే భావించకుండా పరమేశ్వరుడే అని నోరారా కీర్తించాడు. పూర్తిగా సంతోషంతో ఉన్నట్లు 'నితరాం... కౌతుకతా' అన్నాడు. తరువాత 'గురుపుంగవ ప్రంగవకేతన' అని సంబోధించాడు. పుంగవ కేతనుడు అనగా వృషభాన్ని జెండాగా ధరించినవాడు శంకరుడే కదా. ఇక్కడ అవతార ప్రస్తావన వస్తుంది.


ముందుగా పట్టిజడుడైన తోటకుడు, శంకరుల అనుగ్రహం వల్ల భావావేశంతో వ్రాసాడు. అట్టి భావావేశం, సురేశ్వరాచార్యునకుండదు. ఎందుకంటే ఆయన శంకరుల శిష్యుడవక ముందు కర్మమీమాంసకుడు, యాగాలు, యజ్ఞాలు చేసినవాడు. శంకరులతో ఆయనకు వాద ప్రతివాదాలు జరిగాయి.


No comments:

Post a Comment