Friday 10 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 97 వ భాగం



కాని వసిష్ఠుని మాట వ్యర్థం కాకూడదు. అందువల్ల రాక్షసుడయ్యాడు. ఇంతవరకూ పురాణాలలో ఉన్నదే. అక్కడనుండి వ్యాఖ్యానంలో ఉన్నది వివరిస్తా. ఆధారం లేకుండా వారు వ్రాయరు.


కల్మష పాదుడు రాక్షసుడై, వసిష్ఠ తనయులనే తినడం మొదలు పెట్టాడు. అపుడు వసిష్ఠ తనయుడు శక్తి వచ్చాడు. అతని దర్శనం వల్లనే ఇతనికి జ్ఞానోదయమయింది. రాజు పాపం పోయింది. ఉపదేశం ఇమ్మని ఇతణ్ణి అడిగాడు. బ్రహ్మ విద్యోపదేశం చేయగా అతడు ముక్తుడయ్యాడు. అందువల్ల గురుపరంపరలో శక్తికి స్థానముంది.


శక్తి కొడుకు, పరాశరుడు, గర్భస్థుడై యుండగానే వేదాధ్యయనం చేసినవాడు. అతడు వ్యాసుడనే పుత్రుణ్ణి, విష్ణుపురాణాన్ని లోకానికి అందించాడు. భాగవతానికి మూలం, విష్ణు పురాణం. దానినుండి సూక్తులను శంకరులు పేర్కొన్నారు. అది భక్తి గ్రంథంగా కనబడినా పాలలో పంచదార కలిపినట్లుగా అందు భక్తి, జ్ఞాన, అద్వైత వేదాంతాలుంటాయి. అతడొక 'స్మృతి'నందించాడు. అదే 'పరాశర స్మృతి'. కలిలో ప్రధాన 'స్మృతి'.


తరువాత వ్యాసుడు. శంకరుల రచనలలో ఏది ప్రధానమైనదంటే, సూత్ర భాష్యమంటారు. వ్యాసుడందించిన బ్రహ్మ సూత్రాలకే అది భాష్యం. బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తుల సారం. వేద విభజన, 18 పురాణాల రచన మొదలైనవి. ఎన్నో వ్యాసుడు చేసాడు. శంకరుల చరిత్రలు తెలియాలంటే ఎన్నో పూర్వగాథలు తెలియాలి. ఆధ్యాత్మిక పరంపర తెలియాలి. లేకపోతే పెద్ద పర్వత పంక్తుల్ని చిన్న రంధ్రం నుండి చూసినట్లైతుంది.


మహావిష్ణువు నుంచి శుకుని వరకు పురాణ పురుషులు. వీరి ప్రభావం, శంకరులపై ఎట్లా ఉందో తెలియాలి.


విష్ణువు నుండి శుకుని వరకూ అద్వైతులతో బాటు విశిష్టాద్వైతులు, మాధ్వులు కూడా ఆ వరుసను పాటించి నుతిస్తారు. మనకు, ముఖ్య గురువులలో విష్ణువొకడు. కాని పై సంప్రదాయాలకు, అతడే ప్రధాన గురువు. 

No comments:

Post a Comment