Monday, 13 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 100 వ భాగం



ద్వైపాయనుడు అనగా రెండు ద్వీపాల మధ్య తిరుగువాడు, వ్యాసుడు కనుక 'పరివ్రజంతం' అని ఉంది. పుత్ర అనే సంబోధనతో ఉన్నాడు. అనగా వ్యాస పుత్రుడు. 'ద్వైపాయనం', అనే మాట శ్లోకంలో ఉంది. 'పుత్రేతి' అని వేరొకచోట ఉంది. సన్న్యాసులను పరివ్రాజకులని అంటారు. అనగా శుకుడు ఇంటినుండి వెళ్ళిపోతున్నాడు. దానికి ముందు రెండు విశేషణాలున్నాయి. అనుపేతం = ఉపనయనం కాకుండా; అపేతకృత్యం = అన్ని శాస్త్ర కర్మలను విడిచినవాడై. అనగా ఉపనయనానికి ముందే బ్రహ్మజ్ఞాని అయ్యాడు.


పుట్టుకతోనే జ్ఞానం. ప్రపంచ సుఖాలు, దుఃఖాలు అంటకుండానే జ్ఞానం సంపాదించడం. 'అనుపేతం' అనినపుడు ఉపనయన వయస్సు వచ్చినా ఉపనయనం కాలేదని అనాలి. ఒకడింకా ఉద్యోగ విరమణ చేయలేదంటే చాలాకాలం నుండి చేస్తున్నాడని, విరమణ కాలం సమీపించిందని అర్థం. క్రొత్తగా ఉద్యోగంలో చేరినవాడిని అట్లా అనం. కనుక ఉపనయనం కాలేదంటే ఉపనయనానికి తగిన వయస్సు వచ్చినా కాలేదని అర్థం. అసలు ఉపనయనం ఏడవ ఏట, బ్రహ్మ వర్చస్సును కావాలని కోరుకొనేవానికి ఐదవ యేటనే చేయవచ్చనే శాస్త్రవాక్యం ఉంది. అనగా ఐదవ ఏడు సమీపించే లోపునే జ్ఞానిగా గుర్తింపబడ్డాడు. అట్లా అని చెప్పడం అతని గొప్పతనాన్ని తగ్గించినట్లు కాదు.


దానికి ముందు 'పరిప్రజంతం' అనగా తిరుగుతున్నవాడై. ఇట్లా వెళ్ళడానికి 4,5 సంవత్సరాలుండాలి. పుట్టీ పుట్టగానే పరుగెత్తడం కుదురదు కదా! అసలు జ్ఞాని ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. అయితే ఒకచోట ఉంటే అతడా ప్రదేశానికే పరిమితుడౌతాడని, అతడు వారికి చెందినవాడని వారతనికి చెందినవారనే బంధం ఏర్పడుతుంది. అందువల్ల జ్ఞాని, పరివ్రాజకుడై యుండాలి.


వ్యాసుడెంత గొప్పవాడైనా శుకుని వంటి బ్రహ్మజ్ఞాని కాలేకపోయాడు. ఇంకా అతనిలో పుత్రవ్యామోహం ఉండిపోయింది. ఇంట్లో ఉన్న కొద్దీ బ్రహ్మచర్య దీక్ష, భిక్షాచర్య మొదలైన వాటివల్ల ఇంకా అనుబంధం గట్టిదైపోతుంది. అందువల్ల శుకుడు ఇంటి నుంచి తండ్రికి పుత్ర వ్యామోహం కల్గించకుండా వెళ్ళిపోయాడు. అతని దర్శనం వల్ల ఎందరో బాగుపడాలి. ఇది ఈశ్వర సంకల్పం. అంతేనే కాని తానితరులను దరిచేరుస్తానని శుకుడనుకోడు. ఏ సంకల్పం లేకుండా వెళ్ళిపోయాడు.


వ్యాసుడు తన కుమారుడు పారిపోవడం చూసి పట్టుకుని వెనక్కి తీసుకు రావడానికి ప్రయత్నించాడు. కాని శుకుడు చిక్కలేదు. అపుడు వ్యాసుడు 'పుత్ర, పుత్రా' అని ఎలుగెత్తి ఆక్రోశించాడు.


No comments:

Post a Comment