ముందతడు శంకరుల దివ్య తేజస్సునకు ఆకర్షితుడు కాలేదు. అతడెప్పుడూ కర్మానుష్టానంలో ఉండేవాడు కనుక భావావేశానికి లోనయే పరిస్థితే లేదు. అట్టివారు తత్త్వాన్ని అంగీకరించిన తరువాత నమ్ముతారు. అందువల్లనే నిష్క్రియను బోధించే నైష్కర్మ సిద్ధి అనే గ్రంథాన్ని తరువాత వ్రాసేడు. తైత్తిరీయ ఉపనిషత్తుకు వార్షికం వ్రాసే సందర్భంలో పరమశివుని అవతారంగానే శంకరులను కీర్తించాడు.
"ముముక్షు సార్ధవాహస్య, భవనామభృతో యతే" అన్నాడు. ముముక్షువులలో ముఖ్యుడని, యతీయని, భవుడని అన్నాడు. సార్ధవాహుడు వర్తకులలో ముఖ్యుడు. ఆ వర్తకుల గుంపుకు దారి చూపిస్తాడు. అందువల్ల ముముక్షువులనే గుంపునకు దారి చూపించు సార్ధవాహులు శంకరులు. సంసార సముద్రాన్ని దాటించువారు.
ఇక పద్మపాదుడు, వీరిని "భాష్యవిత్తకగురుః" అన్నాడు. వారు వ్రాసిన భాష్యాలే వారి విత్తమని అర్ధం. శంకరులు బ్రహ్మ సూత్ర భాష్యంపై పంచపాదిక వ్రాస్తూ ఇట్లా అన్నాడు. అనగా జ్ఞానమే ద్రవ్యంగా కలవారని.
పద్మపాదుని వృత్తాంతాన్ని బట్టి అతనికి పాండిత్యమూ ఉంది. వీరిపట్ల అపారమైన భక్తి కూడా ఉంది. తోటకుడు, భక్తునిగానే కన్పిస్తాడు.
హస్తామలకుడు, జ్ఞానంలో లీనమైనవాడే.
పద్మపాదుడు వీరిపై చమత్కారంగా ఒక శ్లోకం వ్రాసేడు. అసలు శివుడొక విధంగా శంకరులొక విధంగా ఉంటారని అన్నాడు. శంకరుల కాలంలో అసలు శివుణ్ణి, ఆదిశంకరుడని, వీరిని అవతార శంకరులని కీర్తించేవారు. శంకరాచార్య పరంపరలో శంకరులనే ఆది శంకరులని అంటున్నాం. ఇతడు వీరిని అపూర్వ శంకరుడని అన్నాడు. అనగా శంకరుని కంటె భిన్నులు, విశిష్టులనే అర్థంలో, శ్లేషతో కూడిన ఈ శ్లోకాన్ని చూడండి:
"నమామ్య భోగి పరివార సంపదం
నిరస్తభూతిం అనుమార్ధ విగ్రహం
అనుగ్రహం ఉన్మృదితకాల లాంఛనం
వినా వినాయకం అపూర్వ శంకరం".
ఇందిద్దరికీ భేదాలు చూపించబడ్డాయి. అవతార శంకరులు ఆరువేల మంది సన్న్యాస శిష్యులతో కూడి ఉండేవారట. "సర్వజ్ఞం బ్రహ్మసంస్థం మునిగణ సహితం" అని సురేశ్వరుడు వీరిని పేర్కొన్నాడు. శ్లోకంలో "భోగి పరివార సంపదం" అంటే భోగాలు లేని శిష్యులు కలవారని. ఇక కైలాస శంకరుడు, భోగి పరివార సంపద కలవాడు. ఎలాగంటే శంకరుని చుట్టూ పాములే. కంఠం చుట్టూ పూలదండలలాగా పాములుంటాయి. పడగ గలిగిన పామును భోగి అంటాం. అందు నవరత్నాలుంటాయి. ఆచార్యుడు శంకరుని నుతిస్తూ కన్నులే చెవులుగా గలిగిన పాములను ధరించినవాడని కీర్తించారు.
No comments:
Post a Comment