అందువల్ల చంద్రశర్మగా అవతరించాడు. ఇప్పుడు శిష్యునికే (గౌడునకు) శిష్యుడయ్యాడన్నమాట. మానవునిగా అవతరించాడు కనుక ఒక గురువును సమీపించి రావి ఆకులపై మరల భాష్యాన్ని వ్రాయవలసి వచ్చింది.
వాటిని ఒక మూట కట్టి నిద్రిస్తూ ఉండగా కొంత భాగాన్ని ఒక మేక నమిలి వేసింది. అది తినిన భాగాన్ని 'అజభక్షిత భాష్యం' అంటారు.
మిగిలిన భాగాన్ని రక్షించి ప్రయాణం చేస్తూ ఉజ్జయిని వచ్చాడు. ఒక వర్తకుని ఇంటి అరుగు మీద కునుకు తీసాడు. అన్ని రోజుల అలసట వల్ల రక్తం పోవడం వల్లా రోజులకొద్దీ నిద్రలో మునిగిపోయాడు. ఆ వర్తకునికి ఒక కూతురుంది. ఇతడు నిద్ర నుండి లేపినా లేవడం లేదు. ఆకలితో మరణిస్తాడని పెరుగన్నం ఒంటినిండా పూసి రుద్దింది. ఆసారమైనా ఒంటబడుతుందని అట్లా చేసింది. కొంత కాలం గడవగా మెళకువ వచ్చి ఆ మూటను చంకన బెట్టుకుని ప్రయాణమయ్యాడు.
ఏమయ్యా! అట్లా వెళ్ళిపోవడం బాగుందా? నీ ప్రాణాన్ని నిలిపిన నా కూతురునిచ్చి నీకు వివాహం చేద్దామనుకుంటున్నానని వర్తకుడన్నాడు.
బ్రాహ్మణుడు వైశ్య కన్యను వివాహమాడడమేమిటి? అది ఈనాటి మాట కాదు. ఏనాటి కాలమో అది శంకరుల కాలానికే ముందు జరిగిన కథ. వారెన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారో మనకు తెలియదు కదా! పూర్వయుగాలలో అట్టి వివాహాలుండేవి.
మంట పెద్దదైతే నీటిని చల్లినా ఆరిపోదు. తక్కువ మంట మీద పోస్తే ఇట్టే ఆరిపోతుంది. అట్లాగే బ్రహ్మ తేజస్సంపన్నులైన వారు చేసిన పనులకు దోషం అంటదు కూడా. అట్టివారికి పిల్లలనీయడానికి మిగిలిన వర్ణాలవారూ ముందుకు వచ్చేవారు. ఇట్టివారు కలిలో లేరు కనుక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వర్ణాల స్త్రీని వివాహమాడాలని అన్నారు. కాని చంద్రశర్మ కాలంలో మిగిలిన వర్ణాల స్త్రీలను వివాహమాడడం ఉండేది.
No comments:
Post a Comment