Thursday 9 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 96 వ భాగం



వసిష్ఠుని నుండి వ్యాసుని వరకూ


బ్రహ్మ మానసపుత్రులలో వసిష్ఠుడొకడు. అతడు మంత్రద్రష్ట, సప్తర్షులలో ఒకడు. పరమ పతివ్రతయైన అరుంధతికి భర్త, నారాయణుడు, రామునిగా అవతారమెత్తగా అతనికి గురువైనాడు. అతడే రామునకు, జ్ఞానవాసిష్ఠాన్ని ఉపదేశించాడు. అందు బ్రహ్మయే సత్యమని, జగత్తు మిథ్యయని కొన్నివేల శ్లోకాలలో ప్రతిపాదింపబడింది. అందనేక కథలు. అతని తరువాత అతని తనయుడు శక్తి.


జీవన్ముక్తులైన సదాశివ బ్రహ్మేంద్రులు, గురురత్న మాలను వ్రాసేరు. అందు గురు పరంపర ఉంటుంది. దానిలో కంచిలోని 57వ పీఠాధిపతి వరకూ పేర్కొన్నారు. అందులో 87 శ్లోకాలుంటాయి. సుషమ అనే పేరుతో దానికి ఆత్మ బోధేంద్రస్వామి, ఒక వ్యాఖ్యానం వ్రాసేరు. అందు శక్తి గురించి వ్రాస్తూ, బహుమిత్రసహుడనే రాజునకు సంక్రమించిన పాపాన్ని కేవల తన దర్శనంవల్ల పోగొట్టాడని వ్రాయబడింది. అది అతని మహత్త్వము.


సూర్యవంశంలో బహుమిత్రసహుడు పుట్టాడు. వసిష్ఠుడతనికి కుల గురువు. ఒక రాక్షసుడు, తిన్నగా ఇతణ్ణి ఎదుర్కొనలేక వసిష్ఠ శాపానికి ఇతడు గురియగునట్లుగా చేసాడు. ఒక వంటలవానిగా ఇతని కొలువులో చేరాడు. మిత్రసహుడు, శ్రాద్ధం పెడుతూ వసిష్ఠుని భోక్తగా పిలిచాడు. ఆ వంటవాడు, మనుష్య మాంసాన్ని వండి దీనిని వసిష్ఠునకు వడ్డించండని అన్నాడు. దానిని చూడగానే వసిష్ఠునకు నరమాంసమని తెలిసింది. వెంటనే రాజును నీవు నరమాంస భక్షకునిగా మారి పొమ్మని శపించాడు.


రాజేమి చేస్తాడు? ఇతనికీ కోపం వచ్చింది. గురువని కూడా లెక్క చేయకుండా తిరిగి శాపం ఇద్దామని నీటిని గ్రహించి, వసిష్ఠుని మీద చల్లబోతూ ఉండగా మంత్రి వచ్చి, గురువును శపిస్తే వంశనాశమౌతుందని అన్నాడు.


అయితే చేతిలో నీటిని ఏం చేయాలి? ఎక్కడో చల్లాలి కదా? చల్లబడిన చోట, అది దగ్ధమై పోతుంది. తన పాదాలమీదే చల్లుకున్నాడు. కాలు నల్లబడి కాలిపోయింది. అందుకు కల్మషపాదుడయ్యాడు.


No comments:

Post a Comment