Wednesday 15 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 102 వ భాగం



పతంజలి చరితం


17వ శతాబ్దం చివరలో తంజావూరు రాజైన షాహ్ జీ తన రాజ్యం విద్వాంసులతో కళకళలాడుతూ ఉండాలని ఎందరినో విద్వాంసులను - తిరువిసనల్లూర్ కి తీసుకొని వచ్చాడు. ఒక గ్రామాన్ని 64 మంది విద్వాంసులకు అగ్రహారంగా ఇచ్చాడు. అందొకడు రామ భద్ర దీక్షితులు. ఇతనిలో వ్యాకరణం కవిత్వం రెండూ ఉన్నాయి. అతణ్ణి ఆనాడు పతంజలియని పిలిచేవారు.


ఇతడు పతంజలి చరితమే కాకుండా జానకీ పరిణయమనే నాటకాన్ని వ్రాసేడు. రామభక్తుడగుటచే రామస్తవకర్ణ రసాయనం, రామచరితస్తవం అనే గ్రంథాలను, రామాయణంలో లేని విశేషాలను వ్రాసేడు. దక్షిణ దేశపు పరువును నిలబెట్టాడు.


ప్రస్తుతం ఎనిమిది సర్గలున్న పతంజలి చరితాన్ని చూద్దాం.


రాముడు గుర్తుకు వస్తే హనుమ గుర్తుకు వచ్చినట్లు నటరాజును ప్రస్తావిస్తే ఒక పాము, పెద్దపులి గుర్తుకు వస్తాయి. అవి అతని నృత్యాన్ని చూసి యుంటాయి. పెద్ద పులి పాదాలు కలిగినవాడిని వ్యాఘ్రపాదుడని అంటారు. పామును కాలుగా కలిగినవాడు పతంజలి.


ఇక వెంకట కృష్ణ దీక్షితులు వ్రాసిన నటేశ విజయంలోనూ పతంజలి ప్రస్తావన వస్తుంది. రెండు పుస్తకాలలోనూ పోలిక ఉంది.


వీటిల్లో పతంజలి, ఆదిశేషుని అవతారంగా చెప్పబడింది. ఆదిశేషునకు, - విష్ణువునకూ సంబంధం ఉంది. విష్ణువు దగ్గరగా నున్నవాడు నటరాజు భక్తుడెట్లా అయ్యాడు? క్షీరాబ్దినుండి చిదంబరానికి ఎందుకు వచ్చినట్లు? విష్ణువే పంపించినట్లుంది. అయితే విష్ణువునకు నటరాజునకు సంబంధం ఏమిటి?


No comments:

Post a Comment