Thursday 30 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 117 వ భాగం



శరీరాన్నే ఆత్మయని భావించడం జీవాత్మ భావం. ఇది అనేక వాసనలతో కూడి యుంటుంది. అట్టి దానిని మట్టుబెట్టడం మాటలు కాదు. అట్టి దానిని కూడా కేవలం దీపాన్ని ఊదినట్లు పోగొట్టడం నిర్వాణం. అట్టి భావం పొందాలంటే ఎంతో సాధన ఉండాలి. భగవదనుగ్రహమూ ఉండాలి.


బుద్ధుడే ఈ నిర్వాణాన్ని గురించి మొదట చెప్పాడనడం అసంగతం. అంతకుముందే ఈ ముక్త స్థితిని మన గ్రంథాలు నిర్వాణమని అన్నాయి. గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలను చెపుతూ 'బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి' అన్నాడు. సన్న్యాస యోగంలో తన యందే క్రీడించువాడు, సుఖించువాడు, లోచూపు కలవాడైన యోగి, బ్రహ్మ స్వరూపుడై, బ్రహ్మ నిర్వాణాన్ని (బ్రహ్మానందాన్ని) పొందుతున్నాడని చెప్పాడు. (గీత. 5-24)


"యోఽంతస్సుఖః అంతరారామః తథా అంతర్ జ్యోతి రేవయః 

సయోగీ, బ్రహ్మనిర్వాణం, బ్రహ్మభూతోఽధి గచ్ఛతి 


బుద్ధుడు, నిర్వాణాన్ని గూర్చి చెప్పాడు. అంతకుముందు భగవానుడు, బ్రహ్మ నిర్వాణాన్ని గురించి చెప్పాడు. బుద్ధుడు, జీవాత్మ భావం పోతుందని, అదే శూన్యస్థితియని చెప్పగా జీవాత్మ భావం పోవడమే కాదు, బ్రహ్మమే అవుతాడని భగవానుడన్నాడు.


శుకుడు, దిగంబరుడని చెబితే పవిత్ర స్థితిలో నున్నాడని, స్త్రీ పురుష భేదం లేకుండా ఉన్నాడని, భేద భావం కలిగినవారు కూడా ఇతని సన్నిధిలో అట్టి భావం కల్గియుంటారని అర్థం.


శుకుడు, ఇంటినుండి నగ్నంగా వెళ్ళిపోతూ ఉండగా నగ్నంగా స్నానం చేసే స్త్రీలు ఇతనిని చూసినపుడు సిగ్గు పడలేదు. తరువాత పుత్ర అని ఆక్రోశిస్తూ వ్యాసుడు వచ్చాడు. జింక చర్మాన్నో, చెట్ల బెరడునో కట్టుకొన్నా ఆయనను చూసి సిగ్గుపడి స్త్రీలు తమ శరీరాన్ని కప్పుకున్నారట.


నేను ముసలివాణ్ణి కదా! ఏమిటీ సిగ్గని వ్యాసుడు ప్రశ్నించాడు. వయస్సుకేమి? అతని పవిత్రత చూసి ఆశ్చర్య చకితులమయ్యాము, మాకూ అతనికీ భేదం కనబడలేదని సమాధానం ఇచ్చారట. అట్టి శుకుని వంటివారికి నియమాలుండవు.


No comments:

Post a Comment