వ్యాసుడు, శంకరుల గురువైన గోవింద భగవత్పాదులతో, ఈశ్వరుడవతరించబోతున్నాడు, అతడు నీకు శిష్యుడు కాబోతున్నాడని, ఉపదేశమిమ్మని అన్నాడు. బాలశంకరుడు గోవింద భగవత్పాదుల దగ్గరకు వచ్చినప్పుడు గురువు నీవెవరని అడిగాడు. నీవు, నేనూ, అతడూ అంతా బ్రహ్మమే కాదా! ఇది తెలిసికొనిన నేను (బ్రహ్మ స్వరూపాన్నే అని దశశ్లోకి రూపంలో సెలవిచ్చారు. ప్రతి శ్లోకం చివర శివోహం అని ఉంటుంది. వీటిలో కైలాస శంకర ప్రస్తావన తీసుకొని రాక ఉపనిషత్తులలో ప్రతిపాదింప బడిన శివం - శాంతం - అద్వైతం - అహం బ్రహ్మాస్మి - శివోహం, ప్రతిపాదింపబడ్డాయి. "తదేకో వశిష్టః శివః కేవలో.. హం" అని అన్నారు.
ఆచార్య పరంపర
మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, అందలి ఋషులను చెబుతాం. అయితే సన్న్యాసులకు ప్రవర ఉంటుందా?
ఇక మరొక ప్రవర వివాహాలలో ఉంటుంది. వధూవరులను గురించి చెప్పేటప్పుడు మూడు తరాలవారిని పేర్కొంటాం. ముందు ఋషుల పేర్లు చెప్పి ఏ గోత్రంలో ఉన్నాడో చెప్పి వరుని యొక్క ముత్తాత, తాత, తండ్రులను గురించి చెబుతాం. అట్లాగే వధువు గురించి కూడా చెబుతాం. శ్రాద్ధాదులలో తండ్రి, తాత, ముత్తాత పేర్లను వరుసగా ఉచ్చరిస్తారు.
శంకరులు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా ఆత్రేయ గోత్రమని, తండ్రి శివ గురువని; తాత, విద్యాధిరాజని చెప్పి యుంటారు. ముత్తాత పేరు చెప్పబడిందో లేదో నాకు గుర్తులేదు.
అయితే సన్న్యాసి యైనపుడీ ప్రస్తావన ఉండదు. అయితే గురు పరంపర గురించి చెబుతారు గాని, వంశ పరంపర ఉండదు. ఇక్కడ ప్రవరయనగా గురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాపరగురువుల ప్రస్తావన ఉంటుంది. చివరకు ఆదిగురువు.
No comments:
Post a Comment