Saturday 21 March 2015

21 మార్చి ప్రపంచ అటవి దినోత్సవం

అలకనంద .. హిమాలయాల్లో ఒదిగిన అందాల లోయ. కాలం కన్నుకుట్టుకునేంతటి ప్రకృతి మాయ. ఆ లోయలో ప్రతి సెలయేరు, చెట్టుగట్టు, ఎగుడూదిగుడు ఆ కుర్రాడికి సుపరిచితం. అప్పట్లో ఆ ప్రాంతంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భాగం. ఆ కుర్రాడు ఒకసారి అమ్మతో 'రుద్రనాధ్' ఆలయానికి వెళుతూ ఆల్‌పైన్ వృక్షాల తోటను చూశాడు. 'అబ్బ ....... ఎంత అందంగా ఉన్నాయో!' అనుకుంటూ అటువైపు పరుగు మొదలుపెట్టడంతోనే .....

'ఆగు ...!' అంటూ అరిచింది అమ్మ.
'ఏమిటీ?' అన్నట్టు చూశాడీ కుర్రాడు.
'అటువైపు చెప్పులతో వెళ్ళకు, పువ్వులు నలిగిపోతాయ్, పువ్వలంటే దేవతలురా ...!' ఆదేశించింది అమ్మ.

పర్వత ప్రాంత ప్రజలకు ప్రకృతంటే ఎంత ఆరాధనో ఉందో తెలిపే సంఘటన ఇది. పర్యావరణ పరిరక్షణ వంటి పెద్దపదాలు తెలియకున్నా సామాన్యులకు - ప్రకృతికి మధ్యనున్న సమన్వయం గురించి చెప్తుందీ సంఘటన. అది ఆ పిల్లాడిలో చాలా మార్పు తీసుకువచ్చింది, చిప్కో ఉద్యమానికి దారి తీసింది. గిరిజనులకు, అడవి మీద ఆధారపడి జీవించేవారికి అడవంటే కేవలం చెట్లు, పుట్టలే కాదు, అది వారికి తల్లి, అడవితల్లి. అటువంటి అడవితల్లి ఇప్పుడు ప్రమాదంలో పడింది.

పక్షి, జంతు జాతులకు నివాసాలు వనాలు. అరుదైన వృక్షసంపదకు, వనమూలికలకు ఆవాసాలు, నదీనదాలుకు ఆవిర్భావ స్థలాలు అడవులు. అడవులు భూమాతకు ఊపిరితిత్తుల వంటివి. జీవవైవిధ్యానికి పట్టుకొమ్మలు అడవులు.

జీవుల నుంచి విడుదలయ్యే కార్బన్-డై-ఆక్సయిడ్ ను పీల్చుకుని, చక్కని ఆక్సిజెన్ ను మనకందించి మన జీవనానికి తోడపడుతున్నాయి చెట్లు. చెట్లె లేకపోతే ప్రతి రోజు విడుదలయ్యే కొన్ని కోట్ల టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ భూమికి భారమవుతుంది. ఫలితంగా ఉష్ణొగ్రతలు పెరిగి భూతాపం మరింత పరుగుతుంది. మానవ మనుగడ ప్రశార్ధకం అవుతుంది. చెట్లు, అడవులు లేని మన జీవనాన్ని ఊహించలేం.

వర్షాలు పడి వరదలు వస్తే, సారవంతమైన మట్టి వర్షపు నీటికి కొట్టుకుపోకుండా ఆపుతున్నవి చెట్లు/అడవులే. చెట్లు, అడవులు లేకపోతే భూమి తన సారం కోల్పోయి, ఎడారిగా మారిపోతుంది. మానవ జీవనం దుర్భరమవుతుంది.

పచ్చని చెట్లు భూగర్భజలాలను పట్టి ఉంచుతాయి. సూర్యుడి కిరణాలు డైరెక్టుగా నేలమీద పడకుండా అడ్డుకుని భూమి తేమను కోల్పోకుండా కాపాడుతున్నాయి చెట్లు. చెట్లు లేకపోతే భూగర్భజలాలు అడుగంటిపోతాయి.

మనిషికి మానసికంగా అభివృద్ధి చెందాలంటే మెదడు సక్రమంగా పని చేయాలి, మెదడుకు రక్తప్రసరణ బాగా జరగాలి. రక్తప్రసరణ బాగా జరగాలంటే ఆక్సిజెన్ కావాలి. చెట్లను నరికేస్తే మనకు ఆక్సిజెన్ ఎక్కడిది? చెట్లను నరికేయడం అంటే మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అవుతుంది, మానవుడి ఉన్నతి ఆగిపోతుంది.

అడవులు నరికేస్తే ఏమవుతుందిలే అనుకోవచ్చు. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంటుంది. దేనికి హాని కలిగినా, అది అన్నిటి మీద ప్రభావం చూపుతుంది. పెద్దవాళ్ళకు గుర్తుండే ఉంటుంది. కోస్తాంధ్రా తీరప్రాంతం 1977 లో భయానకమైన తుఫానును చవిచూసింది. దివిసీమ మొత్తం స్మశానంలా మారిపోయింది. తీర ప్రాంతమంతా అతలాకుతలం అయింది. దానికి కారణం ఏమిటో తెలుసా? తీరప్రాంతంలో ఉన్న మడ అడవులను నాశనం చేయడమే. మడ అడవులు ప్రకృతి ఏర్పరుచుకున్న కంచుకోటలు. అవి దట్టంగా ఉన్నంతవరకు తుఫాన్ల ప్రభావం తీరంపై ఉండదు. వాటికి తుఫానలకు సంబంధం ఉంటుంది. ఎప్పుడు మడ అడవులు నరికేసినా, అప్పుడు భీకరతుఫానలు పుట్టి వేల జనాన్ని నశింపజేస్తాయి.

ప్రతి ఏటా రాష్ట్రంలో తుఫాను రావడం, భారీ నష్టం ఏర్పడడం, నష్టపరిహారం కోసం రాజకీయం చేయడమే తప్ప, శాశ్వతమైన పరిష్కారం కోసం మన రాజకీయ నాయకులు పట్టించ్కోవడం లేదు. తీరం నుంచి 1-2 కిలోమీటర్ల మేర మడ అడవులను పెంచితే, నష్టం నివారించవచ్చు.

కానీ ఈ రోజు జరుగుతున్నదేంటి? ప్రపంచవ్యాప్తంగా చెట్లను నరికేస్తున్నాం. ప్రతి ఏటా 13 మిలియన్  హెక్టార్ల అటవిసంపదను నాశనం చేసేస్తున్నాం. రోజు సగటున 100 పైగా అరుదైన ఆయుర్వేద వనమూలికలు అంతరించిపోతున్నాయని అంచనా. అడవులు నరికివేయడం వలన ఆవాసం కోల్పోయిన వన్యప్రాణులు పల్లెలు, పట్టణాల్లోకి వచ్చి జనం చేతులో చచ్చిపోతున్నాయి. దీనికి తోడు మానవుడి అత్యాశ, ముందు చూపు లేని అభివృద్ధి నమూనా కారణంగా అక్రమ రవాణా, మైనింగ్ పేరిట ఎంతో విలువైన అటవి సంపద తరిగిపోతోంది. ఇది మానవుడు చేస్తున్న అతి పెద్ద వినాశనం. మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం.

జరుగుతున్నదంతా అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలనే  21 మార్చి ని ప్రపంచ అటవి దినోత్సవంగా ప్రకటించారు. మనం కాస్త ఆలోచించాలని, మన పంధాను మార్చుకోవాలని
గుర్తుచేస్తోంది ప్రపంచ అటవి దినోత్సవం.

మరి మన బాధ్యత ఏమిటి? మన పరిసరాలలో చెట్లను పెంచాలి. సముద్ర తీర ప్రాంతంలోనూ, నగరాల్లో, గ్రామాల్లో ప్రజలంతా ఐక్యంగా చెట్లు నాటి సామాజికవనాలను అభివృద్ధి చేసుకోవాలి. తరగిపోతున్న అటవీ సంపదను రక్షించడానికి, అటవీ సంపద అక్రమరవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి అమలు పరచాలి. అన్నిటికన్నా ముందు ప్రజలు చైతన్యవంతులై ఉన్న చెట్లను, అడవులను రక్షించుకోవాలి.పర్యావరణానికి హాని చేసేది ఏదైన సరే, ప్రజలు తిరస్కరించాలి.

Originally Published: 20-March-2013
1st Edit: 20-March-2014
2nd Edit: 21-March-2015

No comments:

Post a Comment