Thursday 26 March 2015

లక్ష్మణ స్వామి మనకు ఆదర్శం


ఓం శ్రీ రామాయ నమః

సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిన తరువాత రామలక్ష్మణులు ఆమెను వెతుకుతూ ఋష్యమూక పర్వతం వద్దక చేరడం, హనుమంతుడితో సంభాషణ తరువాత సుగ్రీవుడిని కలవడం జరుగుతుంది. రావణుడు సీతను ఎత్తుకుపోయే సమయంలో పర్వత శిఖరం మీద సుగ్రీవుని గమనించిన సీతమ్మ, తన చీరలో కొద్ది భాగం చింపి, తన ఆభరణాలను అందులో మూట కట్టి సుగ్రీవునికి వద్ద పడేలా విసిరేస్తుంది. ఆ ఆభరణాలను సుగ్రీవుడు రాముడికి చూపగా, రాముడు వాటిని తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు.

వాటిని లక్ష్మణుడికి చూపి 'లక్ష్మణా! చూడు, ఈ ఆభరణాలు సీతవే. సీతే వీటిని విడిచి ఉండవచ్చని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, నువ్వూ ఓసారి పరీశీలించి చెప్పు ' అంటాడు.

అప్పుడు లక్ష్మణుడు

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||  

చేతికడియాలు, చెవి దుద్దుల సీతమ్మవో కావో నాకు తెలియదు. నేను ఎప్పుడు సీతమ్మ పాదాలకే వందనం చేసేవాడిని అన్నయ్య, కనుక కాళ్ళకు సంబంధించిన నూపురములు(కడియాలు) మాత్రం ఖచ్ఛితంగా సీతమ్మవే అన్ని చెప్పగలను అంటాడు. సీతమ్మను తల్లిగా భావించిన లక్ష్మణస్వామి, ఎప్పుడు సీతమ్మ పాదాలే చూస్తూ మాట్లాడేవాడు. ఈ సంఘటన వనవాసానికి వచ్చిన కొత్తలో జరగలేదు, సీతరామలక్ష్మణులు 13 ఏళ్ళు వనవాసం చేశాక జరిగిన సంఘటన ఇది.

భార్య తప్ప ఇతర స్త్రీలను తల్లిలా చూసిన మహోన్నత సంస్కృతి మనది. స్త్రీని తల్లిగా చూసిన సంస్కృతి హిందువులది. కానీ ఈ రోజు మనం రామాయణం మర్చిపోయాం, అందులోని విలువలు మర్చిపోయాం. పిల్లలకు ఇటువంటి విషయాలు చిన్నవయసులో చెప్పకపోవడం వల్లే, ఎందరో ఉన్మాదులుగా తయారయి స్త్రీల మీద అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మనం మీద రామానుగ్రహం కలిగి మనలో మంచి సంస్కారాలు కలగాలని రాముడిని వేడుకుందాం. ఇటువంటివి తల్లిదండ్రులు పిల్లకు చెప్పి, వారిలో మంచి సంస్కారాలు కలిగించాలి. 

ఓం శ్రీ రామాయ నమః
Originally posted: April 2013
1st Edit: 05-April-2014
2nd Edit: 26-March-2015

No comments:

Post a Comment