Sunday 22 March 2015

మార్చి 22, ప్రపంచ జల దినోత్సవం


అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలవర్ణంతో కనిపించడానికి కారణం నీరు. భూభాగంలో నీటి వనరులు 75% వరకు ఉన్నాయి.

భూగోళం మీద ఉన్న నీటి వనరులలో 99 % ఉన్నది ఉప్పు నీరే. ఇది 97% సముద్రాల్లోనే ఉంది. మిగితాది నదులు, చెరువుల్లో ఉంది. త్రాగడానికి పనికోచ్చే శుద్ధ జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువుల్లో , 0.02% నదుల్లో ఉండగా మిగిలినవి భూగర్భ జలాలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా 0.3% త్రాగడానికి ఉపయోగపడే నీరుమాత్రమే మనకు అందుబాటులో ఉంది.

ఈ శుద్ధ నీటి వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్ల జనాభ దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. పరిశ్రమలకు, కర్మాగారాలకు ఉపయోగపడుతున్నాయి. ఎన్నో జీవాలకు బ్రతుకునిస్తున్నాయి.

భారతదేశంలో సింధు-సరస్వతీ నాగరికత, ఈజిప్టులో నైలు నదీ తీరంలో  నాగరికత ఇలా ప్రపంచ చరిత్రలో అనేక నాగరికతలు నదీ తీరాల్లో, నీటి వనరులకు సమీపప్రాంతంలో వైభవోపేతంగా విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ఉన్నది.

జీవం నీటిలోనే మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీరు కావాలి. జీవవైవిధ్య రక్షణకు నీరు అవసరం. నీటితోనే జీవం సాధ్యమవుతుంది.


ఇవన్నీ మనకు తెలుసు కానీ మనం చేస్తున్నదేంటీ? ఈరోజు జరుగుతున్నదేంటీ? నీరును వృధా చేస్తున్నాం. కలుషితం చేస్తున్నాం. విషతుల్యం చేస్తున్నాం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది త్రాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేసేస్తున్నాం. నీటి వనరులలో చెత్తచెదారం కలిపి త్రాగడానికి ఉపయోగపడకుండా చేస్తున్నాం, చేసుకుంటున్నాం.   

మనం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2050 నాటికి ప్రపంచపరిస్థితిని అంచనా వేసారు. 2050 నాటికి ఈ ప్రపంచంలో త్రాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదని, స్నానాలు చేయడం మానేసి జనం శరీరానికి రసాయనికలేపనాలు పులుముకుంటారని, కెమికల్ బాత్ చేస్తారని, సరిహద్దుల్లో ఉండవలసిన సైన్యం నీటి వనరుల చుట్టు కాపలా ఉంటారని, తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీపురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని, ఇంకా ఇలాంటి అనేక భయానకమైన విషయాలను తన ప్రెసంటెషన్‌లో ఉంచారు.

భారతీయులమైన మనకు నీటి విలువ కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజిస్తాం, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తాం.

నారము అంటే నీరు. నీటి యందు ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు.

శివుడు ఏకంగా గంగను తల మీద ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయవలసినది కాదు, నెత్తిన పెట్టుకుని పూజించవలసినదని సమస్త మానవాళికి సందేశం ఇస్తున్నాడు.

నీటిని వృధా చేయడం సృష్టికి వ్యతిరేకం. భగవత్తత్వానికి వ్యతిరేకం. సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టు విలువైనదే.


ఆలోచించండి. 0.3% మాత్రమే ఉన్నాయి శుద్ధనీటి వనరులు. ఇప్పటికే చాలా భాగం కలుషితమయ్యాయి. పూర్తిగా కలుషితమైతే మనకు దిక్కేది? మన వారసులకు మనం ఇచ్చేదేంటి?

చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రతి ఒక్కరు చాలా శాతం నీటి వృధాను అరికట్టవచ్చు. అందరూ పాటిస్తే కొన్ని కోట్ల లీటర్ల నీటి వృధా అరికట్టబడుతుంది.

రండి! నీటిని, తద్వారా జీవాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం. ప్రతి నీటి చుక్క విలువైనదే.

మార్చి 22, ప్రపంచ జల దినోత్సవం. నీటి వనరుల రక్షణ గురించి జనంలో చైతన్యం తెద్దాం.             

Originally published: 21-03-2013
1st Edit : 20-03-2014
2nd Edit : 21-03-2015

No comments:

Post a Comment