Saturday 21 March 2015

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

షడ్రుచుల(6 రకాల రుచుల) సమ్మేళనం ఉగాది పచ్చడి. అవే చేదు, తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం. దీనిని మనం దైవప్రసాదంగా స్వీకరిస్తాం. జీవితం కూడా అంతే. జీవితంలో అన్ని సుఖాలే ఉండవు, అన్నీ దుఃఖాలే ఉండవు. అన్ని భావాలు ఉంటేనే అది పరిపూర్ణమైన జీవితం అవుతుంది. మన జీవితంలో వచ్చే కష్టాల నుండి మన పాఠాలు నేర్చుకుంటే ఉన్నతస్థానానికి వెళ్ళగలం. జీవితంలో ఏది వచ్చినా అది దైవప్రసాదంగానే భావించాలి తప్ప తిరస్కరించకూడదు. ఉగాది పచ్చడిలో మొదట కొందరికి తీపి తగిలితే, కొందరికి చేదు తగులుతుంది. చేదు తగిలిందని ఉగాది పచ్చడి పడేయం కదా. అలాగే జీవితంలో కష్టాలు వచ్చాయని జీవితాన్ని సగంలోనే ముగించడం కాదు, రాబోయే సంతోషం కోసం ఎదురుచూడాలని మనకు చెప్తోంది ఉగాది పచ్చడి. నిజానికి భవిష్యత్తులో ఏదో సుఖం వస్తుందని ఆశించడం కాదు, మన ఈ జీవితం గత జన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క ఫలం. అందుకని జీవితాన్ని యదాతధంగా అంగీకరించాలి. అదే ఉగాది పచ్చడి పరమార్ధం.

ఎంతో పుణ్యం చేస్తే కానీ రాదు ఈ మనిషి జన్మ.  మళ్ళీ మనిషిగా పుట్టాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. వచ్చిన జన్మను సక్రమంగా, దైవప్రసాదంగా జాగ్రత్తగా వాడుకోమని గుర్తుచేస్తోంది ఉగాది పచ్చడి.

నలుగురికి సాయం చేయాలి, ప్రతిసారీ డబ్బు సాయమే చేయక్కర్లేదు, కష్టాల్లో ఉన్నవారికి కాస్త మాట సాయం చేసినా చాలు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. మనతో కలిసి బ్రతికే జంతువులు, పక్షులను ఆదుకోవాలి, కుదిరితే కొద్దిగా ఆహారం పెట్టాలి, కుదరకపోతే కనీసం నీరైన పెట్టాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన తర్వాతి తరాల వారికి ప్రకృతిని జాగ్రత్తగా అందించాలి. దేశభక్తి కలిగి దేశానికి సేవ చేయాలి. మన ధర్మాన్ని మనం పాటించాలి. ప్రపంచ శాంతి కోరుకోవాలి. ఇదే మన నుండి దేవుడు ఆశించేది.

ఈ ఉగాది మన జీవితంలో ఒక నవశకానికి పునాది అవుతుందని ఆశిద్దాం. మనం చేసే మంచిపనుల్లో మనకు ఈ సంవత్సరం అన్నీ విజయాలే ఇస్తుందని ఆశిద్దాం.

అందరికి ఉగాది శుభాకాంక్షలు.

Originally posted: Ugadi 2012
1st Edit: 31-03-2014
2nd Edit: 21-03-2014

1 comment: