Friday 20 March 2015

ఉగాది - విశేషాలు

21 మార్చి 2015, శనివారం, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది

ఉగాది గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం

ఉగాది ఎందుకు జరుపుకుంటాం?

యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. ఈ యుగాదే కాలక్రమంలో ఉగాది గా పిలువబడుతోంది.

హిందూ కాలమానంలో మొత్తం మనకు 4 యుగాలున్నాయి.

1. కృత యుగం/ సత్య యుగం - 17,28,000 సంవత్సరాలు
2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు
3. ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు
4. కలియుగం - 4,32,000 సంవత్సరాలు

ఈ నాలుగు యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీనినే మహా యుగం అంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అన్ని గ్రహాలు మేషరాశిలో ఉన్న సమయంలో ప్రారంభమైంది కలియుగం. ఈనాటి ఇంగ్లీష్ క్యాలండర్ ప్రకారం చెప్పాల్సివస్తే, సరిగ్గా 5116-17 సంవత్సరముల క్రితం ఫిబ్రవరి 19-20, 3,102 BCలో శ్రీ కృష్ణ పరమాత్మ అవతరపరిసమాప్తి జరిగిన వెంటనే ద్వారపరయుగం అంతమై, కలియుగం మొదలైంది.

ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ కలియుగ ప్రారంభానికి సూచికగా చాంద్రమానాన్ని అనుసరించి మనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం.

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం. ఈ ఉగాది పచ్చడిని సూర్యోదయానికి పూర్వమే తినాలని శాస్త్రం.

Originally published:
1st Edit: 30-03-2014
2nd Edit: 20-03-2015

No comments:

Post a Comment