Friday, 16 October 2015

భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో - బతుకమ్మ పాట



మొదటి భాగం
భూమ్మీద పుడిశెడు ఉయ్యాలో
బండారీ పోసి ఉయ్యాలో
భూదేవి నీ పాట ఉయ్యాలో
బుగ్గలై రాని ఉయ్యాలో

జగతి మీద చారెడు ఉయ్యాలో
చందురం పోసి ఉయ్యాలో
జలదేవి నీ పాట ఉయ్యాలో
జల్దీన రాని ఉయ్యాలో
పాపెట్ల శూరుడా ఉయ్యాలో
బాలవన్నె కాడ ఉయ్యాలో
దండమోయి దేవ ఉయ్యాలో

దండమోయి నీకు ఉయ్యాలో
నెత్తిమీద శూరుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో
దండమోయి దేవ ఉయ్యాలో
దండమోయి నీకు ఉయ్యాలో
పారేటి నా గంగ ఉయ్యాలో
పాతాళదేవి ఉయ్యాలో

పాట నాకివ్వవూ ఉయ్యాలో
జలజల వారేటి ఉయ్యాలో
జల్దీల గంగమ్మ ఉయ్యాలో
గంగమ్మా నా పాట ఉయ్యాలో
జల్దీన రాని ఉయ్యాలో
పర్వతాన ఉండే ఉయ్యాలో
పాతాళమల్లు ఉయ్యాలో
బండారీ నాకివ్వు ఉయ్యాలో.

రెండవభాగం
బొట్టు వెట్టుకుంట ఉయ్యాలో
చుక్కన్నా మెరిసేటి ఉయ్యాలో
చక్కన్నీ తల్లీ ఉయ్యాలో
కురుచ బొమ్మల నడుమ ఉయ్యాలో
కుంకుమబొట్టు ఉయ్యాలో

కాపువరి బాలలు ఉయ్యాలో
వాకన్నె పడసులు ఉయ్యాలో
అందరితోటి గూడి ఉయ్యాలో
అక్కవ్వ ఎల్లెనే ఉయ్యాలో

ఏడుగురి తోడనే ఉయ్యాలో
అక్కవ్వ ఒక్కతే ఉయ్యాలో
అందరి గుల్లలు ఉయ్యాలో
మేదరి గుల్లలు ఉయ్యాలో

అక్కవ్వ గుల్ల ఉయ్యాలో
బంగారి గుల్ల ఉయ్యాలో
అందరితో కల్సి ఉయ్యాలో
అడవికి ఎల్లెనే ఉయ్యాలో
పెద్దలకు వచ్చె ఉయ్యాలో

పెత్తర అమాస ఉయ్యాలో
బాలల కచ్చిందే ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
గుట్టకు చేరిరే ఉయ్యాలో
గునుకపువ్వు తెంపిరి ఉయ్యాలో

చెట్టుకు చేరిరి ఉయ్యాలో
చేమంతి తెంపిరి ఉయ్యాలో
పోతపోతనే వాళ్లు ఉయ్యాలో
పోకపువ్వు తెంపే ఉయ్యాలో.

మూడవ భాగం
అన్ని పూవులు కల్సి ఉయ్యాలో
ఆనందం తోటి ఉయ్యాలో
బంగారి బాలలు ఉయ్యాలో

గుల్లలు నింపిరి ఉయ్యాలో
గుల్లలు తీసుక ఉయ్యాలో
నెత్తిన వెట్టిరి ఉయ్యాలో
ఇంటికి బాలలు ఉయ్యాలో

చేరనే వచ్చిరి ఉయ్యాలో
అవ్వలా మా యవ్వ ఉయ్యాలో
మమ్ముగన్న తల్లీ ఉయ్యాలో
స్నానాలు వొయ్యవే ఉయ్యాలో

నూనెలు అంటవే ఉయ్యాలో
వెండిబిందెలు తీసుకొని ఉయ్యాలో
వేడి నీళ్లే వోసి ఉయ్యాలో
వేడి నీళ్లు చన్నీళ్లు ఉయ్యాలో

ఏడు రంధ్రాల నీళ్లు ఉయ్యాలో
సిద్దెల నూనె ఉయ్యాలో
సిరిగిన్నెల ఒంపనే ఉయ్యాలో
కుడి చెంపనంటే ఉయ్యాలో
మారు చెంపనంటే ఉయ్యాలో

వెండి దువ్వెన వట్టి ఉయ్యాలో
వేయి చిక్కులు తీసే ఉయ్యాలో
పైడి దువ్వెన వట్టి ఉయ్యాలో
పక్క చిక్కులు దీసే ఉయ్యాలో
ముత్యపు గుండెక్కి ఉయ్యాలో
ముని జలకామాడె ఉయ్యాలో.

నాల్గవ భాగం
పగడంపు గుండెక్కి ఉయ్యాలో
పై జలకమాడె ఉయ్యాలో
అవ్వలా ఓ యవ్వ ఉయ్యాలో

మమ్ముగన్న తల్లీ ఉయ్యాలో
పెద్దదినెకు ఉన్నది ఉయ్యాలో
చిక్కు చీరె ఉయ్యాలో
చిక్కు చీరె నాకు ఉయ్యాలో
కావాలె నాకు ఉయ్యాలో

నన్ను అడుగకు బిడ్డా ఉయ్యాలో
వదినెనే అడుగు ఉయ్యాలో
వదినే దగ్గరకు వోయి ఉయ్యాలో
చీరె అడుగవట్టె ఉయ్యాలో
ఆ వదినే అనవట్టె ఉయ్యాలో

చిక్కు చీరెమీద ఉయ్యాలో
చినుకు వడితే హక్కు ఉయ్యాలో
హక్కు నీ నెత్తురు ఉయ్యాలో
చుక్క బొట్టు వెడుదు ఉయ్యాలో

ఆ చీర తీసింది ఉయ్యాలో
మరదలికి ఇచ్చింది ఉయ్యాలో
అందమూ సక్కగా ఉయ్యాలో
చీరెలు గట్టెనే ఉయ్యాలో
పెసరగాయ బబ్బెర్లు ఉయ్యాలో

పెయినిండా సొమ్ము ఉయ్యాలో
కందికాయ బబ్బెర్లు ఉయ్యాలో
కాళ్ళ కడియాలు ఉయ్యాలో
అన్ని సొమ్ముల మీద ఉయ్యాలో
ఆది బన్నసరమూ ఉయ్యాలో.

ఐదవ భాగం
బతుకమ్మ వట్టుకొని ఉయ్యాలో
బయలు దేరినారె ఉయ్యాలో
పారేటి గంగలో ఉయ్యాలో
బతుకమ్మను ఇడిసిరి ఉయ్యాలో
పసులకాడి బాలలు ఉయ్యాలో

పలుగాకులోయి ఉయ్యాలో
హక్కు చీరెనే ఉయ్యాలో
అంతా నానిపాయె ఉయ్యాలో
సిన్నవాయె హక్కుఉయ్యాలో
పొన్న పూవోలె ఉయ్యాలో
బీరిపాయె హక్కు ఉయ్యాలో
బీర పూవువోలె ఉయ్యాలో

ఇంటికి అక్కవ్వ ఉయ్యాలో
చేరవచ్చెనే ఉయ్యాలో
ఆ చీర జూసనే ఉయ్యాలో
వదినె కండ్లతోటి ఉయ్యాలో
అందరి పెద్దోడు ఉయ్యాలో
రామన్నను పిలిచే ఉయ్యాలో
మీ చెల్లె నిందలు ఉయ్యాలో
మనమూ మెయ్యరాదు ఉయ్యాలో
చంపవోయి నీవు మీ చెల్లెను ఉయ్యాలో
చెల్లెను తీసుకొని ఉయ్యాలో

అడవికి వెళ్లెను ఉయ్యాలో
అడవిల ఉన్నాడు ఉయ్యాలో
అంధకారి బాపనయ్య ఉయ్యాలో
కత్తిని జూసింది ఉయ్యాలో
పరుగులూ వెట్టింది ఉయ్యాలో.

ఆరవ భాగం
భయపడకు బాల ఉయ్యాలో
గుబులు పడకు బాల ఉయ్యాలో
బాపనయ్యతో బాల ఉయ్యాలో
ఇంటికి చేరింది ఉయ్యాలో
చెల్లెలు జాడలు ఉయ్యాలో
తల్లి అడుగవట్టె ఉయ్యాలో
పొద్దులు వాయె ఉయ్యాలో
చెల్లెలేది ఉయ్యాలో

వస్తదే నా తల్లీ ఉయ్యాలో
ఆరాటం జేయకు ఉయ్యాలో
బాపనయ్య వెంటనే ఉయ్యాలో
చెల్లెలు చేరవచ్చే ఉయ్యాలో
అప్పుడు చెల్లెలు ఉయ్యాలో
అవ్వలా నాయమ్మ ఉయ్యాలో
అన్న కత్తులు దీసె ఉయ్యాలో
కనుగుడ్ల కోసమని ఉయ్యాలో
భయపడి నేను ఉయ్యాలో
బాపనయ్యను జేరితి ఉయ్యాలో.

సేకరణ:శ్రీమతి బి. కళాగోపాల్;
నిజామాబాద్
http://goo.gl/wTmWWZ

No comments:

Post a Comment