Saturday 17 October 2015

దేవీ నవరాత్రులు - స్వామి శివానంద

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గం.

ధర్మాచరణకు, సాంప్రదాయక పూజలకు, వ్రతాలకు కొన్ని సమయాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి దేవతారాధన మాత్రమే కాక, పూర్వకాలంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనలను జ్ఞాపకం చేస్తాయి. వీటిలోని నిగూఢ రహస్యాలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తే కొన్ని దృష్టాంతాలు అగుపడ్తాయి. ఈ దృష్టాంతాలే జీవుడు ఆత్మానుభూతి పథంలో చేసే పయనానికి ప్రధానమైన సూచికలుగా, మార్గదర్శిలుగా పనిచేస్తాయి.

స్థూలంగా గమనిస్తే దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ విజయోత్సవంలాంటిదే. శుంభ, నిశుంభులలాంటి రాక్షసుల సంహారానికి చేసిన యుద్ధాలలో దేవి సాధించిన విజయ పరంపరలను ఈ నవరాత్రులలో దేవికి సమర్పిస్తారు. కాని ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. విశ్వం వివిధ దశలలో మానవుడు భగవంతుడిగా. జీవాత్మ పరమాత్మగా ఎదగడానికి, వికాసానికి ప్రతీకగా ఈ సత్యం నిలుస్తుంది. వ్యక్తిగత స్థాయిలో సాధకుడి ‪ఆధ్యాత్మిక‬ సాధనకు దిశానిర్దేశం చేస్తుంది.

పరమాత్మతో నీకు గల శాశ్వత ఐక్యతను గుర్తించడమే నీ ఉనికి మూల ఉద్దేశం. ఉన్నతమైన సంపూర్ణత్వానికి ప్రతిరూపమే పరమాత్మ. అది మాలిన్యాలులేని స్వచ్ఛత, నిరంజనం. 'దాని'తో నీ ఐక్యతను గుర్తించడం, 'దాని'లో విలీనం కావడం... అంటే ఆ దివ్యత్వంలా ఎదగడమే, వికసించడమే. అందువల్ల సాధకుడు ప్రాధమిక చర్యగా తనలో పేరుకుపోయిన లెక్కకు మించిన మాలిన్యాలను, దుర్గుణాలను తొలగించుకోవాలి. అటు తర్వాత అనంతమైన సద్గుణాలను, పవిత్రమైన దైవీ గుణాలను అలవరచుకోవాలి. అప్పుడు స్వచ్ఛమైన దైవీగుణాలతో పరిపూర్ణమైన స్థితిలో నీలో .... నిర్మలమైన నీటికొలనులో ప్రభాత సూర్యకిరణాలలాగ  జ్ఞానం ప్రకాశిస్తుంది. అందుకు దోహదం చేస్తూందీ నవరాత్రి వ్రతం.

స్వామి ‪శివానంద‬ సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/JwHM0H (స్వల్ప సవరణలతో)

No comments:

Post a Comment