Wednesday, 18 August 2021

శ్రీ హనుమద్భాగవతము (14)

 


పూర్వము గార్ధభ నిస్వనుడనే అసురచక్రవర్తి ఉండేవాడు, వాడు పరమశివభక్తుడు, కాని శ్రీహరి ద్వేషము కలవాడు. అమృతత్వమును కోరి పరమశివుడిని ఆరాధించాడు. ఘోరమైన తపసు చేశాడు. శివానుగ్రగానికి పాత్రుడై జాగ్రన్నిదావస్థలలో ఎవరిచేత కూడా మరణము లేకుండా వరమును పొందాడు. వరగర్వముతో ఆ అసురేశ్వరుడు శ్రీమన్నారాయణుని సాధించుటకు ప్రయత్నింపసాగాడు. శ్రీహరి ధర్మస్వరూపుడు, సత్య స్వరూపుడు, యజ్ఞమూర్తి గావున ఈ మూడింటిని భగ్నం చేస్తే అతడు శక్తిరహితుడవుతాడని, సునాయాసంగా ఓడిపొతాడని అధర్మపరులు అసురేశ్వరునకు దుర్భోధ చేసారు.

అపుడా అసురచక్రవర్తి సత్యవంతులను, ధర్మపరాయణులను, బాధించడం ఆరంభించాడు. యజ్ఞయాగాదులను భగ్నం చేయుట మొదలుపెట్టాడు.  శ్రీహరిభక్తులను హింసింపసాగాడు. దేవలోకంపై దండెత్తి దేవతలను నిర్జించి వారిని హింసింప సాగెను, అసురుని ఆగడములను భరింపలేక దేవతలు బ్రహ్మ దేవుని శరణు వేడారు. బ్రహ్మ దేవతలను తోడ్కొని శ్రీమన్నారాయణుని శరణువేడారు. అప్పుడు శ్రీహరి అసురుని సంహరించి ధర్మసంస్థాపన చేస్తానని దేవతలకు అభయం ఇచ్చారు, ఆ విషయము తెలిసుకున్న శంకరుడు వైకుంఠమునకు వెళ్ళాడు. శ్రీహరిచే సత్కారములు పొంది సుఖాసీనుడై ఇలా పలికాడు : ‘అచ్యుతా! గార్దభనిస్వనుడు నా భక్తుడు, వానికి ఎవ్వరూ కీడు చేయలేరు. నాచే అమోఘములైన వరములను పొంది 'అతడు మృత్యువు లేని వాడైనాడు'. 

శ్రీహరి ఇట్లు పలికెను : ‘సదాశివా! ‘జాతస్య మరణం ధృవమ్'. ఆ అసురుడు మరణింపక తప్పదు. వాని అధర్మమే వాని మృత్యువునకు కారణము కాగలదు. అనతి కాలంలోనే వానిని సంహరించి దుష్టశిక్షణము శిష్టరక్షణ చేస్తానూ. శంకరుడు ఇట్లా పాలికాడు. 'మాధవా! గార్దభనిస్వమని సంహరించుట అసంభవము. నీవా పని చేస్తే నేను నీకు దాస్యం చేస్తాను, ఇదే నా శపధము’. 

శ్రీహరి శంకరుని ప్రతిజ్ఞ విని మందహాసము చేసి మౌనము వహించాడు.

No comments:

Post a Comment