Tuesday, 17 August 2021

శ్రీ హనుమద్భాగవతము (13)



అంజన సర్వలోకమహేశ్వరుని చరణాలకు నమస్కరించి వినయపూర్వకముగా 'కరుణామయుడవైన సదాశివా! సర్వసద్గుణ సంపన్నుడు, యోగ్యుడైన ఒక పుత్రుని ఇమ్ము' అని అడిగింది.


ఈశ్వరుడు ప్రసన్నుడై 'ఏకాదశరుద్రులలో పదునొకండవ అంశ అయిన రుద్రరూపమే నీకు పుత్రరూపంలో జన్మించగలదు, మంత్రాన్ని స్వీకరించు. వాయుదేవుడు నిన్ననుగ్రహిస్తాడు. దానివలన నీకు సర్వసద్గుణసంపన్నుడగు పుత్రుడు జన్మింస్తాడ’ని పలికాడు


పార్వతీశ్వరుడంతర్థానమయ్యాడు. అంజనా దేవి అంజలి చాచి శివప్రదత్తమైన మంత్రాన్ని జపించసాగింది. ఆ సమయములోనే వెనుక చెప్పబడిన ఆడ గ్రద్ద కైకేయి పాయస భాగాన్ని తీసికొని ఆకాశంలో పరుగెడుతోంది. వెంటనే ఒక పెనుగాలి వీచింది. గ్రద్ద శరీరము ముడుచుకొని కొనిపోజొచ్చింది. పాయసము దాని ముక్కు నుండి జారింది. వాయు దేవుడు మొదటి నుండి సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఆ పాయసాన్ని అంజన దోసిలిలో పడవేస్డు. శంకరుడు మొదట చెప్పిన దానిని అనుసరించి ఆమె వాయు దేవుడిచ్చిన పాయసాన్ని (చరువును) ఆదరముతో స్వీకరించి గర్భము దాల్చింది.*


ఈ కథకు పూర్వభాగము- * బ్రహ్మలోకంలో అప్సరసలలో సువర్చల అనే ఒక అప్సరస ఉండేది ఆమె ప్రవర్తనకు కోపగించిన పితామహుడు (బ్రహ్మ) మౌన్ష్యలోకంలో ఆడగ్రద్దగా జన్మింపవలసినదిగా ఆమెను శపించాడు. తన్ను కరుణించమని ఆమె ప్రార్థించింది. అపుడు బ్రహ్మ ఇలా పలికాడు. దశరథ మహారాజు చేసే పుత్రకామేష్టి యజ్ఞంలో అగ్నిదేవుడు చరువును తీసుకుని ప్రత్యక్షమవుతాడు, అప్పుడా చరువు మొగ్గురు రాణులకు పంచబడుతుంది. నీవు కైకేయీ భాగమైన చరువును తీసుకుని పారిపోతావు. ఆ చరువును నీవు తినజాలవు, కాని దాని స్పర్శచేతనే నీవా గ్రద్దరూపాన్ని వదలి మఱల అప్సరసరూపాన్ని ధరించి బ్రహ్మలోకానికి రాగలవు.


బ్రహ్మదేవుని వాక్కుననుసరించి జరిగింది. గ్రద్దముక్కు నుండి చరువు జారినంతనే దాని శరీరము కూడా విడివడినది. అది వెనుకటివలె దివ్యమగు అప్సరసగా మారి బ్రహ్మలోకానికి వెళ్ళింది.


(ఆనందరామాయాణము)


No comments:

Post a Comment