Wednesday 25 August 2021

శ్రీ హనుమద్భాగవతము (21)



అసురుల అకృత్యములతో భూమి ఆక్రాంతమయ్యింది. భూదేవి ప్ర్రార్థనలను మన్నించి బ్రహ్మశివాదులు శ్రీమన్నారాయణుని భూమి భారమును హరించమనీ, అసురసంహారకుని ప్రసాదించమనీ ప్రార్థించారు.


అపుడు శ్రీహరి ఒక్కక్షణం ఆలోచించి రాక్షసుల నాశము తప్పక జరుగుతుందని పలికాడు. తదనంతరం ఆయన శ్రీహరిహర మహా తేజములను సంగ్రహించి సదాశివునందు ప్రవేశపెత్తాడు. ఈ తేజము మహావానరునిగా ఆవిర్భవించి అసురనాశనం ఒనరించమని పలికాడు. తాను కూడా అవతరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగలనని అభయమొసంగాడు.


పరమేశ్వరుడు పార్వతితో కలసి భూమండలముపై విహరిస్తూ వేంకటాచలము చేరారు. ఆ పర్వతముపై సజ్జనులకు శరణ్యుడైన శ్రీనివాసుడు విరాజిల్లియున్నాడు. ఆదిదంపతులిద్దరూ శేషాచలముపై పుష్పోద్యానముల చెంత, సరస్సుల చెంత విహరింపసాగారు. అదే సమయంలో కింపురుషలోక వాసులైన వానర దంపతులు క్రీడించుటను పార్వతిగాంచెను. ఆమె సంతానేచ్ఛతో ఆది దేవుని సమీపించింది, పరమేశ్వరుడు వానరరూపమును ధరించి వేయిసంవత్సరములు పార్వతీ దేవిపై తన మనస్సును లగ్నం చేసి క్రీడించాడు. తుదకు శ్రీమహా దేవునినుండి శ్రీహరిహర తేజము బయల్వెడలి పార్వతిని సమీపించింది. ఆమె ఆ మహా తేజమును భరింపలేక దానిని అగ్ని దేవునకు ఇచ్చింది. ఆయన కూడా దానిని భరింపలేక సూక్ష్మరూపుడైన వాయువునకు ఇచ్చాడు.


ఆ సమయంలో వేంకటాచలముపై సత్పుత్రప్రాప్తికై అంజన ఘోరతపమాచరించుచున్నది. శంకరుని ఆదేశానుసారము ఆ శ్రీహరిహర తేజాన్ని వాయుదేవుడు అంజనా దేవికి ఇచ్చాడు. ఆ మహా తేజమునుండి శ్రీహరిహర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుడవతరించాడు.


శ్లో॥ వైశాఖే మాసి కృష్ణాయాం దశవిమందసంయుతా | 

పూర్వప్రోష్ఠపదాయుక్తా తథా వైకృతిసంయుతా | 

తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వై సుతమ్ |

మహాబలం మహాసత్త్వం విష్ణుభకిపరాయణమ్ |  (పరాశరసంహిత 6వ పటలము)


No comments:

Post a Comment