Thursday, 5 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (72)



నీటిని యీదునపుడు- నీటిని వెనుకకు తోస్తూ ముందుకు పోతాం. అలానే స్వార్థాహంకార, మమకారాలను నెట్టివేస్తూ త్యాగ బుద్ధితో ముందుకు సాగి పరమపద సోపానాన్ని అందుకోవాలి. అదే పురుషార్థం. అది సాధించాలంటే పావని పరమ చరితం అవశ్య పఠనీయం. ఆచరణకు అనువైనది.


స్వామి వివేకానందుడు- నేటి సమాజానికి హనుమన్మూర్తిని ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని

ఇలా అంటారు. “భగవద్భక్తి వల్ల పుట్టే త్యాగమే లక్ష్యంగా పెట్టుకుని సింహబల సాహసాలతో, దూషణల వంటి వికారాలకు అతీతులై, కర్మ ఫలాకాంక్షను వదలి కార్యరంగంలో దుమకాలి. ఇదే భారత జాతీయ ధర్మం. దీనికి ఉదాహరణ ఆంజనేయస్వామి. ఆ హనుమన్మహావీరుడే మనకి ఆదర్శ పురుషుడు.


జితేంద్రియ చక్రవర్తి, అద్వితీయ ధీశాలీ, రామనామం పై ఉన్న ఆఖండ భక్తితో ప్రాణభీతిని విడనాడి ఒక్క దుముకులో సాగరాన్నెలా లంఘించాడో చూడండి. ఆయన ఎంతటి భగవత్సేవకుడో! ఎంతటి ఆదర్శమూర్తో!! 


తన అఖండ బాహుబలంతో, అద్వితీయ పరాక్రమంతో రావణుని రాక్షస సైన్యాలను హాహాకార మెత్తించగలిగిన మహా వీరుడతడు. మరోవైపున రామపద పంకజార్చన చేసే భక్తులలో అద్వితీయుడు కూడా ఆతడే. అటువంటి నిశ్చలమైన భక్తియే దేశానికప్పుడు అత్యవసరం !!!


కాన ఓ చదువరులారా! ఆంజనేయుని మనసారా స్మరించుచూ- ఆ పావని చూపిన బాటలో పయనించుచు సంపూర్ణ ఆయురారోగ్య భోగ భాగ్యాలతో- మీ జీవితాలను వసంతయామిని వోలె గడుపుకోవాలనీ, మిమ్ములను సదా వెన్నంటి మారుతాత్మజుడు కాపాడుగాకయని కోరుతూ


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్.


స్వస్తి.  

---- రాయప్రోలు రథాంగపాణి


No comments:

Post a Comment