Wednesday 4 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (71)



త్యాగే నైకే అమృతత్వ మానశుః


ఆంజనేయుడు నవ వ్యాకరణవేత్త. శబ్ద బ్రహ్మ, రామనామ రసాస్వాదన తత్పరుడు. రామ చరిత్రను సమయము దొరికినపుడెల్లా తాను నడయాడు పర్వత శిలాఫలకాలపై రచించుచుండెడి వాడు. రామాయణం పూర్తిగా పర్వత శిలలపై రూపు దిద్దుకున్నది. వారి రచనలో శబ్దార్థాలు సరసంగా, సుమధురంగా ఆపాత మధుర ఆలోచనామృతాలుగా సాగినై, పాఠకుల మనోఫలకాలపై సీతా రాముల గాథ చెరిగిపోని- మాసిపోనిరీతిగా ముద్రింపబడేటట్లు రచన సాగింది.

మారుతాత్మజుడు రామాయణ రచన పూర్తి చేశాడన్న వార్త కర్ణపరంపరగా వాల్మీకి మహామునికి తెలిసింది. అప్పటికే మహర్షి శ్రీమద్రామాయణాన్ని ఆదికావ్యంగా మలచాడు, సామీరిని చేరి ఒకసారి తాను రాసిన రామాయణాన్ని చూపవలసినదిగా కోరాడు. వీతరాగుడైన మారుతి రాళ్ళపై తాను రాసిన రామకథను చూపుతాడు. ఆ శబ్దాల హెుయలు, ఆ భావ సంపద, రచనా రమణీయకత ఆదికవిని ఆశ్చర్యంలో ముంచెత్తినవి.


అంజనా నందనా! నీ రచన అనితరసాధ్యం. నీ రామగాథ ముందు నా రామాయణం సూర్యుని ముందు దివిటీ. కీర్తికాంక్షనై నేను చేసిన నా రచన వృథాయగునేమో! అని ఏమేమో పల్కు వల్మీకభవునితో పావని— "మహర్షీ! మీరు చింతించవలసినది లేదు. ఈ నదీనదాలు పర్వతాలవలె యీ జగాన మీ రామాయణమే శాశ్వతంగా నిలుస్తుంది” అంటూ తాను వ్రాసిన ఆ కొండరాళ్ళను వాల్మీకి చూచు చుండగనే సముద్ర జలాలలోకి దొర్లిస్తాడు. ఇక నా రామకథ ఎవరికంటా పడదు. నీ రామాయణమే అందరి నాల్కలపై నిలుస్తుంది అని చెప్పగా ----


వాల్మీకి నిరుత్తరుడై  "వాయుకుమారా! నిర్మలకీర్తి ఆచంద్రతారార్కం నిలచి ఉంటుంది. నీ త్యాగబుద్ధి నిరుపమానం" అని ప్రశంసిస్తాడు. ]


'త్యాగే నైకే అమృతత్వ మానశుః' త్యాగంతోనే అమృతత్వం సిద్ధిస్తుంది. త్యాగ నిరతితో స్వామి చేసిన యీ కార్యం ఎంతటి ఉదాత్త ఉదాహరణో! కీర్తికాంక్షలు తన లక్ష్యాన్ని దూరం చేస్తాయి. త్యాగ బుద్ధి గమ్యస్థానం చేరుస్తుంది.

No comments:

Post a Comment