అంజనా దేవి
స్వర్గాధిపతీ, శచీదేవి పతియైన ఇంద్రుని దగ్గరనున్న రూపగుణ సంపన్నలైన అప్సరసలలో పుంజికస్థల అనే ఆమె మిక్కిలి ప్రసిద్ధి చెందిన అప్సరస. ఆమె అమిత సౌందర్యవతి, చంచలస్వభావము గలది. ఒకసారి ఆమె తపస్సంపన్నుడైన ఒక ఋషిని చూసి పరిహసించింది.
ఋషి ఓర్వలేకపోయాడు. కోపంతో ఆయన 'వానర స్త్రీవలె చిలిపి చేష్టలు చేయు నీవు వానరస్త్రీని అగుదువు గాక ' అని శపించాడు.
ఋషి శాపాన్ని వినినంతనె పుంజికస్థల కంపించింది. వెంటనే ఆమె ఋషి చరణములపై బడి, చేతులజోడించి దయ జూపవలసినదిగా ప్రార్థింపసాగినది.
సహజంగానే దయాస్వభావుడైన ఆ ఋషి దయార్ద్రతుడై ఇలా పలికెను. 'నా వాక్కు అసత్యము కాజాలదు, నీవు వానరస్త్రీవి కాకతప్పదు, కాని నీవు ఇష్టానుసారముగా రూపాన్ని ధరించగలవు. ఇష్టము వచ్చినపుడు వానర స్త్రీవి, మానవ స్త్రీవి కాగలవు.
ఈ పరమరూపవతియైన ఆ పుంజికస్థల ఋషి శాపముచే వానర రాజు, బుద్ధిమంతుడైన కుంజరునకు పుత్రికగా జన్మించినది. ఆమె సాటిలేని సౌందర్యము కలది. ఆమె అన్దముతో సాటివచ్చు స్త్రీ ఈ భూమిలో ఎవ్వరును లేరు. మూడులోకములలో ప్రసిద్ధి చెందిన ఆ కుంజరునిపుత్రిక పేరు 'అంజన'.
లావణ్యవతి యైన అంజనకు వీరవరుడు, వానర రాజు నగు ‘కేసరి' అనే వానితో వివాహము జరిగినది. కేసరినివాసము కాంచనగిరి (సుమేరుపర్వతము). సర్వసౌకర్యములకు నిలయమైన ఈ పర్వతముపై అంజన తన భర్తతో సర్వసౌఖ్యములను అనుభవించుచుండెను. వీరుడగు కేసరి రూపవతియైన తన భార్య అంజనను ఎక్కువగా ప్రేమించుచుండెను. అంజన కూడ ఎల్లప్పుడు ప్రాణారాధ్యుడగు తన భర్త యందు అమితమైన అనురాగమును చూపుతుండేది. ఇట్లా సుఖముగా ఎన్నో దినములు గడచినవి; కాని వారి కెట్టి సంతానం కలుగలేదు.
No comments:
Post a Comment