బాల్యకాలము
అంజనా దేవి తన ప్రియపుత్రుడైన హనుమంతుని మిగుల శ్రద్ధతోను ప్రేమతోను పెంచుతున్నది. కేసరి కూడా కుమారునిపై ఎంతగానో ప్రేమ చూపుతుండేవాడు. హనుమానుడు సంతోషముతో కిలకిలయనిధ్వని చేయుచుండ అంజనా కేసరులు ఆనంద మగ్నులయ్యేవారు. అతని బాల్య క్రీడలు ఎంతో ఆకర్షకములుగానూ, సుఖకరములుగానూ, అద్భుతములుగానూ ఉండేవి. ఒకనాటిమాట. కేసరి ఎక్కడికో వెళ్ళాడు. అంజన ఖూడా బాలుని ఉయ్యాలలో పరుండబెట్టి ఫలపుష్పముల తెచ్చుటకై వనమునకు వెళ్ళింది. బాలునకు ఆకలేసింది. తల్లి సమీపంలో లేదు. అతడు కాలుచేతుల ఆడిస్తూ ఏడ్వసాగాడు. వెంటనే అతని దృష్టి తూర్పుదిక్కుపై పడింది. అప్పుడే అరుణోదయమవుతోంది. అతడు సూర్యుని అరుణబింబాన్ని ఎఱ్ఱనిపండని తలచాడు.*
(క) ఖ ఆధ్యాత్మరామాయణము 4-9-18, 19.
అసౌ హి జాతమాత్రోఽపి బాలార్క ఇవ మూర్తిమాన్ |
గ్రహీతుమో బాలార్కపుప్లావాంబరమధ్యతః ॥
(స్కంద పు. అవంతీ ఖండము, చతురశీతిలింగమాహాత్మ్యము 78-21)
తేజస్సునకు పరాక్రమమునకు వయస్సుతో నిమిత్తము లేదు. ఇక్కడ హనుమంతుని రూపములో అంజనా దేవి ఒడిలో ప్రళయంకరుడగు శంకరుడు ఏకాదశరుద్రాంశతో ఆడుతున్నాడు. వాయు దేవుడు మొదటనే బాలునకు ఏగిరే శక్తిని ఇచ్చాడు. దానివలన హనుమంతుడు వెంటనే వాయు వేగముతో ఆకాశంలోకి వెళుతుండేవాడు. అతని ఆ వేగమును చూసి దేవదానవయక్షాదులు విస్మితులై ఇట్లా పలుకసాగారు. 'ఈ వాయుపుత్రుని వేగముతో సమానమైన వేగము స్వయముగా వాయువునకు గాని, గరుడునకుగాని, మనస్సునకుగాని లేదు. ఇంత చిన్నవయస్సులోనే ఇతనికి ఇంతటి వేగము, పరాక్రమము ఉంటే యౌవనకాలంలో ఇంకా ఎంత శక్తి ఉంటుందో గదా!'
తనపుత్రుడు సూర్యునివైపు వెళుతుండటం చూసిన వాయు దేవుడు “సూర్యుని తీక్ష్ణకిరణములు నా యీ బాలునకు ఎట్టి బాధను కలుగజేయు కుండుగాక' యని భావించి మంచు వలె శీతలుడై అతని వెంటపోసాగాడు.
No comments:
Post a Comment