Monday 2 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (69)



ఆంజనేయుడు జాంబవంతుని దేహాన్ని కరముతో నిమిరాడు. ఆ కరస్పర్శ జాంబవంతుని అస్త్రబాధ తొలగించింది సంతోషంతో -


"హరి శార్దూలా! ఆ గచ్చ. ఈ తరుణంలో వానరులను నీవే కాపాడాలి. హిమగిరి కావలగల కైలాసగిరిలో సంధాసకరణి, సువర్ణకరణి, సంజీవని ఆదిగా గల ఓషధులున్నవి. తక్షణం పతిత జనావనులను కాపాడ వానిని తీసుకురమ్ము" అనగా


మరుక్షణం గగనాని కెగరిన హనుమ అద్భుతంగా క్షణాలలో చక్రాయుధుడైన చక్రపాణిలా వజ్రాయుధధారి శచీనాధునిలా గిరినే ధరించి నేలకు దిగాడు. ఆ ఓషధుల గాలి తగలగనే — స్పృహలోనికి వచ్చారు వానర వీరులు, మారుతి ఆ గిరిని పని పూర్తికాగనే యధాస్థానంలో ఉంచి వచ్చాడు.


ఇలాగే మరోసారి లక్ష్మణస్వామి మూర్ఛితుడు కాగా కైలాస గిరిని తెచ్చి లక్ష్మణుని పునరుజ్జీవితుని చేశాడు. స్వామివారి నామాలలో "లక్ష్మణ ప్రాణదాతా చ" అని ఉన్నది. ఈరీతిగా సమరాంగణంలో వానరసేనను కంటికి రెప్పలా కాపాడిన అతులిత బలధాముడు. 


యుద్ధరంగాన ఎందరో రాక్షస వీరులను మట్టి కరపించిన ఆంజనేయుడు మహాకాలునివలె విజృంభించినాడు. "ఆహా! ఏమీ వీని శౌర్యము. నేటికిగదా నాకు సరిజోడు లభించినది" ఆ మెచ్చుకుని ఎదిరించిన రావణుడే - యీ మహాబల పరాక్రమవంతుని ముందు నిలబడలేక మర్యాదగా తప్పుకున్నాడు. ఇక అనిలాత్మజుడును రాముని చేతిలోనే 'రావణుని మరణ' మన్న విధిని తలచి వదలివైచినాడు.


సమర రంగాన అసువులు వీడాడు రావణుడు. యుద్ధము ఆగినది. ఈ వార్తను ముందుగా జనకసుతకు వినిపించి ఆనందాన్ని చేకూర్చిందీ మారుతియే. ఆమె “ఆంజనేయా! నేడు మంగళ వారము, ఈరోజు రావణుని మరణవార్త వినిపించి నాకు సంతోషాన్ని కలిగించావు కాబట్టి నేటినుండి యీ వారాన్ని జయవారం అంటారు. ఎవరైతే యీ రోజు గంగ సింధూరం అద్ది నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో- వారికి కార్యసిద్ధి కాగలదు" అని ఆశీర్వదించింది, మంగళవారం ఆంజనేయునికి ప్రియమైన రోజు. 


No comments:

Post a Comment