Tuesday 3 August 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (70)



ఆంజనేయుని అదృష్టం


రామప్రభు రాగను మొదటగా భరత, శతృఘ్నులకు వినిపించినదియు మారుతియే. యీవిధంగా రఘువంశానికి ఆనంద హేతువైన వార్తల నందించి ఆ వంశాన్ని కాపాడినవాడు మారుతాత్మజుడు. రామ పట్టాభిషేక సమయంలో 'గుర్తింపు పొందిన వారికి - సన్మాన సత్కారాలు, నేత్రోత్సవంగా జరిగాయి. సన్మానితులు సంతోష తరంగాల తేలియాడారు. అందరికీ అన్ని సత్కారాలు జరిగాయి. రామాయణ మహామాలా రత్నమైన హనుమంతునికి దప్ప. ఇది సభలో గుసగుసలకు తావిచ్చింది. కారణం కనుక్కో లేకపోయారు తన సర్వస్వం ప్రభుసేవకే అంకితం చేసిన మారుతి ఎవరి గుర్తింపూ పొందలేకపోయాడే! ఇదేమిటి చెప్మా!!! అందరి హృదయాల ప్రశ్నార్థకం.


ఇంతలో రాముడు జనకరాజ నందినికి ఒక అమూల్య ముత్యాల హారం ఇచ్చి “జానకీ! ఈ హారాన్ని నీ అభిమాన పాత్రుడైన సేవకునకు అర్పించ' మన్నాడు సభలో ఇంత వేడుక జరుగుతున్నా మారుతి జితేంద్రియుడై శ్రీ రామచంద్రుని దివ్య పాదార విందాలనే చూస్తూ తదేకంగా ఉన్నాడు. ఈ గౌరవ పురస్సరాలతో తనకు పనిలేదు. ఇవన్నీ తన స్వామి పదసేవ ముందు దిగదుడుపే, హారాన్ని చేతపట్టి సీతామాత చిరునగవుతో వాతాత్మజుని గళసీమ నలంకరించింది. కృతజ్ఞతాంజలి బద్ధుడై మారుతి సీతారాములకు నమస్కరించినాడు.


"స్వయముగా సీతామాత తన కర కమలములతో శిరమున వైచినదీ ముత్యాల హారం. మారుతి ఎంత అదృష్టవంతుడో కదా!" అని సదస్యులు మిన్నుముట్టే కరతాళ ధ్వనులతో సంతోషాన్ని ప్రకటించారు. ప్రత్యేకంగా మారుతి నింతగా సమ్మానించినా సుంతయినా అతిశయించలేదు.


మారుతి కార్యసాధకు డెటులుండవలెనో ఆచరించి చూపాడు. కార్యసాధకునకు అచంచల ఆత్మ విశ్వాసం, పట్టుదల, నిరంతర కఠోర పరిశ్రమ, సంయమనము, ఏకాగ్రత, త్రికరణశుద్ధి, స్వార్థ రాహిత్యము మొదలగు సద్గుణాల సలవరచుకోవాలి. మిన్ను విరిగి మీదపడినా ధైర్యం కోలుపోరాదు. ఉత్సాహం వీడరాదు. ఆవేశం ఆసలే పనికిరాదు. రోషం వదలాలి. లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించాలి. ఇవన్నీ ఆచరణలో చూపిననాడు అత్యద్భుత విజయాలు సాధించవచ్చు. ఇట్టి కార్యసాధకుడు ఎవరెస్టు శిఖరాన్ని అందుకోగలడు. ఇహ పరాలలో సన్మానితుడు కాగలడు. తనంత తానుగా అష్టలక్ష్మి - అష్ట ఐశ్వర్యాలనిచ్చును. పై సద్గుణ సంపత్తి నలవరచుకోనివాడు అవమానాలపాలై నలుగురిలో చిన్న బోవును.


No comments:

Post a Comment