Saturday, 7 August 2021

శ్రీ హనుమద్భాగవతము (2)



కేసరి పూర్వజన్మవృత్తాంతము


యక్షలోకములో మహాయక్షుడను చక్రవర్తి కలడు. అతడు పరమశివభక్తుడు, కుబేరునకు చెలికాడు. సకలసంపదలున్నను అతనికి సంతానము లేదు. కుబేరుని ఆదేశానుసారముగ మహాయక్షుడు పరమశివుని గురించి చిరకాలము తపమాచరించెను. భక్తుని అనన్యతపస్స్సునకు ప్రసన్నుడై ఆశుతోషుడైన శంకరుడు సతీ దేవిసహితముగ సాక్షాత్కరించెను. 


పరమకళ్యాణమూర్తులైన ఆ ఆదిదంపతులను చూసి మహాయక్షుడు పరమానందభరితుడై అనేక విధముల స్తుతించెను. అభీష్టవరము నర్థింపుమని పరమశివుడు పలుకగా యక్షేశ్వరుడు పరమసౌందర్యరూపులగు సతీశంకరులను గాంచి మీరు నాకు పుత్రసంతానముగా కలుగవలెనని అర్థించెను. అందులకు సతీ శివులు సమ్మతించి ఇరువురు ఏకరూపులై అవతరిచెదమని వరం ఇచ్చేను. కింపురుష వర్షములో మహావానరుడైన కేసరిగా జన్మింపుమని మహాయక్షుని ఆదేశించి వారు అంతర్హితులైరి. ఆ మహాయక్షడే వానరేశ్వరుడైన కేసరిగా జన్మించెను. వానరులు కింపురుషలోకవాసులు. వారు ఆనంద బ్రహ్మోపాసకులు, కేనోపనిషత్తులో సచ్చిదానంద బ్రహ్మమును ‘వన’ అను నామముతో ఉపాసించువర్ణనము కలదు.  


'వనే భవం వానమ్, వానం రాతి ఇతి వానరః | 


సచ్చిదానంద బ్రహ్మంలోగల ఆనందాన్ని 'వాన'మని కీర్తిస్తారు. ఆ ఆనందరసాన్ని ఆస్వాదన చేసేవారిని వానరులు అందురు.

No comments:

Post a Comment