శ్రీమన్నారాయణుడు విశ్వమోహినీరూపమును ధరించి గార్దభనిస్వనుని అంతఃపురము దగ్గరనున్న ఒక పర్వతము పై స్వరముతో అవతరించాడు. ఆ అందాలరాసి సుమధుర స్వరంతో సామవేదగానం పాడసాగింది. 'ఆ గానము విని పరవశుడై అసురేశ్వరుడు పర్వతాగ్రమునకు చేరి కోటికందర్ప సౌందర్య రాసి మోహినిని చూసి పరమాశ్చర్యచకితుడై ఇలా పలికాడు. సౌందర్యరాసీ! నేను త్రైలోక్య నాథుడను. నీవ్వరిదానవు? ఏ లోకము నుండి వచ్చావు? నీ మధురగానము ఆలకింపగానే నా శరీరం పులకించింది. నీ సౌందర్యమును చూడగానే నా మనస్సు నీకు అంకితమైనది. సుందరాంగీ! నన్ననుగ్రహించు. నాకు పట్టపురాణివై దేవలోక భోగములను అనుభవింపుము. అప్పుడా మోహిని 'నాతో ఆడిపాడి నన్ను గెలిస్తే అలాగే చేస్తాను' అన్నది. అసుర సార్వభౌముడు మోహితుడై మోహినితో ఆటపాటలయందు మైమరిచిపోయాడు. మోహిని ఆ అసురునకు అమృతమని సురా పాత్రను అందించింది. ఆతడు పరస్త్రీ వ్యామోహముచే సురను సేవించి జాగ్రన్నిద్రావస్థలకు మధ్య ఉండే స్థితిని పొందాడు.
శ్రీమన్నారాయణుడు సమయం ఆసన్నమైనదని గ్రహించి మోహినీరూపాన్ని విసర్జించి వృకనారాయణునిగా అవతరించాడు. బ్రహ్మాది దేవతలందఱు ఆ వృకనారాయణ మూర్తిని అనేకవిధముల స్తుతింపసాగారు.
‘మహావాలో మహాపాదః వృకః పర్వతసన్నిభః' |
శ్రీవృకనారాయణుడు సుదీర్ఘమైన (వాలము) తోక కలిగి ఉన్నాడు (అది కాలము). పెద్దపాదములను కలిగి ఉన్నాడు (అవి సకల విశ్వ సముదాయములు), పర్వతా కారుడై ఉన్నాడు. శ్రీవృకావతారుడు తన మహావాలముతో గార్దభ నిస్వనుని బంధించి కాలసర్పములవంటి తనవాడినఖము (గోర్ల) లతో చీల్చి చెండాడు. గార్ధభనిస్వనుని దేహమునుండి ఒక వెలుగు బయలు దేరి శ్రీవృకనారాయణుని పాదములందు విలీనమయ్యింది. దేవతలు పుష్పవర్షమును కురిపించారు. బ్రహ్మాదులు అనేక విధముల శ్రీహరిగుణములను గానము చేసారు.
శివుడు ఆ ప్రదేసానికి వచ్చి కరుదెంచి శ్రీహరితో ఇలా పలికాడు “జగన్నాథా! జయము నీదే! నేటినుండి నేను నీ సేవకుడనయ్యాను”
అపుడు శ్రీమన్నారాయణుడు
ఇలా అన్నాడు. “సదాశివా! నీవు నాకు పూజ్యుడవు, సేవ చేయవలసిన పని లేదు.”
No comments:
Post a Comment