శ్రీ ఆంజనేయుని నవావతారములు
పరాశర సంహితను అనుసరించి శ్రీ ఆంజనేయుని తొమ్మిది అవతారములు అత్యంత ప్రసిద్ధములు.
శ్లో ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః ||
తృతీయో వింశతిభుజః చతుర్థః పంచవక్త్రశః ॥
పంచమోఽష్టాదశభుజః శరణ్యన్సర్వ దేహినామ్ |
సువర్చలాపతిష్షష్ఠః సప్తమస్తు చతుర్భుజః ||
అష్టమః కధితశ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః |
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్ ||
(శ్రీ పరాశర సంహిత 60 వ పటలము)
1. ప్రసన్న హనుమదవతారము, 2. వీరాంజనేయావతారము, 3. వింశతి (ఇరువది) భుజాంజనేయావతారము, 4. పంచముఖాంజనేయావతారము, 5. అష్టాదశ (పదు నెనిమిది) భుజాంజనేయావతారము, 6. సువర్చలా హనుమదవతారము, 7. చతుర్భుజ (నాలుగు) ఆంజనేయావతారము, 8. ద్వాత్రింశత్ (ముప్పది రెండు) భుజాంజనేయావతారము, 9. వానరాంజనేయావతారము,
విజయుడను క్షత్రియుడు ప్రసన్నాంజనేయుని ఆరాధించి భవబంధవిముక్తుడై పరమపదమును పొందాడు. మైందుడను భక్తుడు వీరాంజనేయ స్వామిని ఉపాసించి లోకములను సాగరంలో తేల్చగల్గాడు. బ్రహ్మ దేవుడు వింశతిభుజాంజనేయోపాసన చేసి సృష్టికర్త కాగలిగాడు. విభీషణకుమారుడైన నీలుడు పంచముఖాంజనేయుని పూజించి చరితార్థుడయ్యాడు. దుర్వాసమహర్షి అష్టాదశభుజాంజనేయుని ఉపాసించి యోగులలో అగ్రగణ్యుడయ్యాడు. శ్రీహీనుడగు ధ్వజదత్తుడనే బ్రాహ్మణుడు సువర్చలాహనుమదీశ్వరుని ఉపాసించి శ్రీమంతుడయ్యాడు. కపిలుడనే బ్రాహ్మణుడు చతుర్భుజుడైన హనుమంతుడిని ఆరాధించి జననమరణచక్రమును ఛేదించి పరమ పదమును పొందాడు. సోమదత్తుడనే రాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. ఆ రాజు ద్వాత్రింశద్భుజాంజనేయు నుపాసించి సకలరాజ్యమును మరల పొంది చక్రవర్తి కాగలిగాడు. గాలుడనే కిరాతుడు వానరాంజనేయుని పూజించి కుష్ఠువ్యాధినుండి విముక్తుడయ్యాడు.
No comments:
Post a Comment