Sunday 22 August 2021

శ్రీ హనుమద్భాగవతము (18)



అసంఖ్యాకులగు దేహధారులు శ్రీ ఆంజనేయస్వామిని ఉపాసించి ఇష్టసిద్ధులను, శాంతిని, పరమపదమును పొంది చరితార్థులైరి. ఎవరైతే శ్రీహరిహరులను హనుమత్స్వరూపంగా భావన చేస్తారో వారు ధన్యులు.


శ్లో! ఏకో దేవ స్సర్వద శ్రీహనుమాన్ 

ఏకోమంత్ర శ్రీహనుమత్ప్రకాశః 

ఏకోమూర్తిః శ్రీహనుమత్స్వరూపా 

చైకం కర్మ శ్రీహనూమత్సపర్యా॥ (ప. స)


అన్నింటిని ప్రసాదించగల శ్రీహనుమంతుడే ఏకైక దైవము. ఆంజనేయుని దివ్యమహిమలను ప్రకాశింపజేసే మంత్రమే ఏకైకమంత్రము. శ్రీ హనుమంతుని రూపము గల విగ్రహమే ఏకైక అర్చావిగ్రహము. శ్రీ హనుమదారాధనా సేవాదులే జీవుని నిజమైన కర్మములు.


శ్లో|| అంజనా సుప్రజావీర -పార్వతీశ్వర సంభవః 

సమర్ధోఽసి మహావీర- మహాబల పరాక్రమః

నరాణాం చ సురాణాం చ - ఋషీణాం హితాయ వై ||


శ్రీ అంజనాకుమారా! నీవు పార్వతీపరమేశ్వరు నుండి అవతరించినవాడవు. మహావీరుడవు, మహాబలపరాక్రమవంతుడవు. నీవు దేవతలకు, మానవులకు, ఋషులకు హితం మొనరించువాడవు.


శ్రీ హనుమదవతరణము


చైత్రశుక్ల పూర్ణిమా మంగళవారము శుభసమయమున భగవానుడగు శివుడు తనకు పరమారాధ్యుడైన శ్రీరాముని ముని మనోమోహకమైన అవతార లీలను దర్శించుటకు, ఆయనకు సహాయము చేయుటకు తన పదునొకండవ రుద్రాంశతో* అంజనా దేవికి పవనపుత్రుడు మహావీరుడు అయిన హనుమానుని రూపమున ఈ భూమిపై అవతరించాడు. 

*యో వై చైకాదశో రుద్రో హనుమాన్ సమహాకపిః |

అవతీర్ణ సహాయార్ధం విష్ణోరమితతేజసః ॥


(స్కం. మాహే. కే. 8-99,100)


పదుకొండవరుద్రుడే అమిత తేజస్వియైన విష్ణువుకు సహాయము చేయుటకు మహాకపియైన హనుమానుని రూపములో అవతరించెను.


కల్పభేదముచేత కొందఱు ఈయన చైత్రశుక్ల ఏకాదశీ దినమున మఘానక్షత్రమున జన్మించినాడనీ, కొందఱు కార్తికకృష్ణ చతుర్దశీ తిథియందు, కొందఱు కార్తికపూర్ణిమా తిథి యందును జన్మించెనని చెప్పుచున్నారు.


(క) చైత్రే మాసి సితే పక్షే హరిదిన్యాం మఘాభిధే | 

నక్షత్రే స సముత్పన్నో హనుమాన్ రిపుసూదనః॥ 

మహాచైత్రీ పూర్ణిమాయాం సముత్పన్నోఽజ్జనీసుతః | 

వదంతి కల్పభేదేన బుధా ఇత్యాదికేచన ॥


(ఆనందరామాయణము, సారకాండ 13.162-68) 


చైత్రశుక్ల ఏకాదశీ దినమున మఘానక్షత్రమునందు శత్రునాశకుడైన హనుమానుడు జన్మించాడు. కొందఱు విద్వాంసులు కల్పభేదాన్ని అనుసరించి చైత్రపూర్ణిమనాడు హనుమంతుడు జన్మించినాడని చెప్పుచున్నారు.

 

No comments:

Post a Comment