Friday, 13 August 2021

శ్రీ హనుమద్భాగవతము (8)



బహుకాలము భర్తతో సుఖంగా జీవితాన్ని గడుపుతున్న అంజనకు ఎలాంటి సంతానము గలుగలేదు. ఆ కారణముతో ఆమె ఎంతో కఠోరంగా తపస్సు చేయనారంభించింది. అట్లా తపమాచరిస్తున్న అంజనను చూచి మతంగ మహాముని సమీపించి 'అంజనా దేవీ! నీ వింత కఠోరతపస్సు ఎందుకు చేయుచున్నావు? అని అడిగారు.


అంజన మహామునిచరణాలకు నమస్కరించి వినయముతో ఇట్లా ప్రత్యుత్తరమిచ్చింది - 'మునీశ్వరా ! కేసరి అనే వానర శ్రేష్ఠుడు నా తండ్రి నుండి నన్ను కోరాడు. ఆయన నన్ను కేసరికి సమర్పించాడు. నేను నా భర్తతో గూడి పెక్కు దినములనుండి సుఖముగా జీవితాన్ని గడుపుతున్నాను. కాని నేటివరకు నాకు సంతానము కలుగలేదు. అందువలని నేను కిష్కింధలో అనేక వ్రర్తాలను, ఉపవాసాలను, తపస్సును చేసాను. కాని పుత్రసంతానము కలుగ లేదు. అందుచే దుఃఖితురాలనై మఱల తపస్సు చేయ నారంభించాను. విప్రవరా! దయయుంచి మీరు నాకు యశస్వియైన పుత్రుడు లభించే ఉపాయము చెప్పండి”.


తపోధనుడైన మతంగమహాముని అంజనతో ఇట్లా పలికాడు. నీవు వృషభాచలము (వేంకటాచలము)నకు వెళ్ళి భగవానుడైన వేంకటేశ్వరుని చరణములకు నమస్కరించు. ఆయన భుక్తి ముక్తి దాయకుడు. పిమ్మట అచటినుండి కొలది దూరమున నున్న ఆకాశగంగ అనే తీర్థానికి వెళ్ళి స్నానము చేయ్యి, దానిలోని నీటిని త్రాగి వాయు దేవుని ప్రసన్నునిగా చేసుకో. దానివలన దేవతలకు, రాక్షసులకు, మనుష్యులకు అజేయుడు, అస్త్రశస్త్రములకు లొగని పుత్రుడు నీకు జన్మించగలడు'.


అంజనా దేవి మహాముని చరణాలకు నమస్కరించి వృషభాచలానికి చేరింది. వేంకటేశ్వరుని పాదపద్మములకు భక్తితో నమస్కరించినది. పిమ్మట ఆమె 'అకాశగంగ’ అనే తీర్థంలో స్నానమాచరించి, పరమపావనమైన దాని జలాన్ని త్రాగినది. దాని ఒడ్డున కూర్చుని తీర్థము వైపు తిరిగి వాయు దేవుని ప్రసన్నతకై ఎంతో సంయమముతో తపస్సు చేయనారంభించింది. శారీరకకష్టములను గూడ లెక్క చేయక శ్రద్ధా విశ్వాసములతోనూ, ధైర్యముతోనూ అఖండమైన తపస్సు చేయసాగింది.

No comments:

Post a Comment