Sunday, 29 August 2021

శ్రీ హనుమద్భాగవతము (26)



ఎదుట నిలచియున్న బ్రహ్మదేవుని చూడగానే వాయుదేవుడు పుత్రుని ఒడిలోనికి తీసుకుని నిలబడ్డాడు. అప్పుడు హనుమానుని చేవులకు అలౌకికమైన కుండలాలు వ్రేలాడుచున్నాయి, శిరస్సున కిరీటము, కంఠమున హారములు, దివ్యమైన అవయవాలపై స్వర్ణాభూషణములు శోభిల్లుతున్నాయి. వాయుదేవుడు బ్రహ్మ దేవునిచరణముల పైబడ్డాడు. 


చతురాననుడు వాయుదేవుని లేవనెత్తి ఎంతో ప్రేమతో అతడు కుమారుని అవయవములను తన కరకమలములతో నిమిరాను, బ్రహ్మకరస్పర్శచేత పవనపుత్రుడు మూర్ఛ నుండి తేరుకొని, లేచి కూర్చున్నాడు. తన పుత్రుడిట్లా జీవితుడవటం చూసి జగత్తునకు ప్రాణస్వరూపుడైన వాయు దేవుడు వెనుకటివలె వీచసాగాడు. దానివలన మూడులోకాలకు మరల ప్ర్రాణములు వచ్చినట్లు అనిపించాయి.


బ్రహ్మ సంతుష్టుడై హనుమంతునకు వరములను ఇస్తూ “ఈ బాలునకు బ్రహ్మశాపము తగులదు, వీని అవయవములను ఏ శస్త్రాస్త్రములు కూడా ఎప్పుడును ఛేదింపజాలవు " అని పలికాడు. మరల ఆయన దేవతలనుద్దేశించి ‘దేవతలారా! అసాధారణుడైన ఈ బాలుడు భవిష్యత్తులో మీ అందరికి పరమ హితమును చేకూర్చే వాడవుతాడు. అందువల్ల మీరు ఇతనికి వరములను ఇవ్వండి' అని పలికాడు.


దేవేంద్రుడు వెంటనే ప్రసన్నుడై హనుమానుని కంఠాన్ని వాడని కమలమాలతో అలంకరించి ఇలా పలికాడు - ' నేను ప్రయోగించిన వజ్రాయుధము చేత ఈ బాలుని దవడ విరిగిపోయినది, అందువలన ఈ కపిశ్రేష్ఠుడు నేటి నుండి హనుమంతుడను పేరుతో పిలువబడుతాడు*. 


మత్కరోత్సృష్టవజ్రేణ హనురస్యయథా హతః |


నామ్నా పై కపిశార్దూలో భవితా హనుమానితి ||


(వా. రా. 7-88-11)


ఇంతేకాక ఈ బాలునిపై నా వజ్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు, ఇతని శరీరం నా వజ్రముకంటెను ఎంతో కఠినముగా ఉండగలదు.”


No comments:

Post a Comment